టీజర్: మా నీళ్ల ట్యాంక్.. ఇది నవ్వులతో నిండిన ట్యాంక్..!

Mon Jun 27 2022 20:38:27 GMT+0530 (IST)

Maa Neella Tank Official Teaser

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ ''మా నీళ్ల ట్యాంక్'' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ప్రియా ఆనంద్ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఈ సిరీస్ తో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జీ5 రూపొందిస్తున్న ఈ ఒరిజినల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ చేసిన 'మా నీళ్ల ట్యాంక్' ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను ఆవిష్కరించారు. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో సుశాంత్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించాడు.

బుచ్చివోలు అనే గ్రామంలోని నీళ్ల ట్యాంక్ చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఆ ఊరి పెద్ద కోదండం కొడుకు గోపాల్ (సుదర్శన్) నీళ్ళ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. తాను ప్రేమించిన సురేఖ (ప్రియా ఆనంద్) ను తిరిగి తీసుకొస్తే కానీ ఆ ట్యాంక్ పై నుండి తాను దిగనని బెదిరిస్తాడు.

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తన కొడుకు ఇలా చేయడంతో కంగుతిన్న కోదండం.. సురేఖను తీసుకొచ్చే బాధ్యతను సబ్ ఇన్స్పెక్టర్ అయిన సుశాంత్ కు అప్పగిస్తారు. ఈ పని చేస్తే అతను కోరుకుంటున్నట్టు ఆ ఊరి నుండి ట్రాన్సఫర్ చేస్తానని హామీ ఇస్తాడు. అయితే ప్రియా ఆనంద్ ను సుశాంత్ కూడా ప్రేమిస్తున్నట్లు టీజర్ ని బట్టి తెలుస్తుంది.

మరి సురేఖ ను గోపాల్ కోసం తిరిగి తీసుకొచ్చారా? సురేఖ - ఇన్స్ పెక్టర్ మధ్య ప్రేమ కథ సంగతేంటి? అసలు ఈ నీళ్ల ట్యాంక్ కథేంటి? ఇందులో అమాయక సురేఖ స్వార్థపరుల చేతుల్లో ఎలా సాధనంగా మారిందనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇందులో సుశాంత్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. అతని తొలిసారిగా డిఫరెంట్ స్లాంగ్ ట్రై చేసాడు. ప్రేమ్ సాగర్ - నిరోషా - బిగ్ బాస్ దివి - అన్నపూర్ణమ్మ - రామారాజు - అప్పాజీ అంబరీశ్ - బిందు చంద్రమౌళి - సందీప్ వారణాసి - లావణ్య రెడ్డి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

''మా నీళ్ల ట్యాంక్'' సిరీస్ కు 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. రాజశ్రీ - సురేష్ కథ అందించారు. సునీల్ కశ్యప్ సంగీతం సనకూర్చగా.. కిట్టు విస్సాప్రగఢ డైలాగ్స్ రాసారు. అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ నిర్వహించిన ఈ సిరీస్ కు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు.

'మా నీళ్ళ ట్యాంక్' సిరీస్ జీ5 ఓటీటీలో జులై 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఎనిమిది ఎపిసోడ్స్ గా అందుబాటులోకి రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ సుశాంత్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.