`డర్టీ హరి`ని మించి మరోటి తీస్తున్న ఎంఎస్ రాజు?

Sun May 09 2021 21:32:49 GMT+0530 (IST)

MS Raju is taking another step beyond Dirty Hari

టాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్ని నిర్మించిన గ్రేట్ నిర్మాతగా ఎం.ఎస్.రాజు సుపరిచితం. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన శత్రువు -దేవి-మనసంతా నువ్వే-ఒక్కడు-వర్షం-నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ విజయాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.దర్శకుడిగానూ గత ఏడాది డర్టీ హరితో భారీ విజయం అందుకున్నారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై `7 డేస్ 6 నైట్స్` పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ - ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. దీనికి నిర్మాతలుగా సుమంత్ అశ్విన్- రజనీకాంత్ .ఎస్ వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ``ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ 7 డేస్ 6 నైట్స్ చిత్రాన్ని సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుడుతున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభిస్తాం. కొంత హైదరాబాద్... మరికొంత గోవా మంగుళూరు.. అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. డర్టీ హరితో తన సత్తా చూపించిన నాన్నగారు.. మరో విభిన్నమైన జానర్ లో ఈ సినిమా చేయనున్నారు`` అని అన్నారు.

యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమిది. సంగీతం ఇతర సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తాం. గత ఏడాది డర్టీ హరితో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. డర్టీ హరిని మించి ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.