మా బిల్డింగ్ డ్రామా.. అప్పుడలా ఇప్పుడిలా ఇక ఇంతేనా?

Sun May 15 2022 14:00:01 GMT+0530 (IST)

MAA President Manchu Vishnu

మూవీ ఆర్టిస్టుల ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా తొలిగా ప్రకటించేది ఆర్టిస్టులకు సొంత భవంతి. గెలిచాక ఇదిగో పులి అంటే అదిగో మేక అన్న చందంగానే ఉంటుంది. ఇది చాలామంది అధ్యక్షుల విషయంలో నిరూపణ అయ్యింది. అయితే వీళ్లందరికీ మంచు విష్ణు అతీతుడు కాదా? అన్న చర్చా ఇప్పుడు వేడెక్కిస్తోంది. ఈ యువ అధ్యక్షుడి ప్రకటన కూడా మరో రాజకీయ నాయకుడి ప్రకటనలా నీరు గార్చేస్తుందా?  ప్రకటనలు ఘనం పనులు శూన్యం! అన్న చందంగా మరో రాజకీయ నాయకుడి ప్రకటనలాగే మిగిలిపోనుందా? అంటూ మా అసోసియేషన్ లోని 900 మంది ఆర్టిస్టులు లోలోన మదనపడడం హాట్ టాపిక్ గా మారింది.మా ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్...ఈ సందర్భంగా AIG హాస్పిటల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఈ వేదికపైనా మరోసారి మా సొంత భవంతి నిర్మాణం గురించి మంచు విష్ణు కదిపారు. మరో ఆరునెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాం! అంటూ మరోమారి విష్ణు ప్రకటించారు. అయితే ఆయన అధ్యక్షుడు అయిన వెంటనే మా అసోసియేషన్ బిల్డింగ్ ని సాధ్యమైనంత తొందరగా నిర్మించేస్తామని అన్నారు. కానీ కనీసం పునాది రాయి కూడా పడలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు మరోసారి మా భవంతిని మరో ఆర్నెళ్లలో కట్టేస్తామని అంటున్నారు. అయితే ఇది నమ్మకమేనా?  మరో రాజకీయ ప్రకటన లాంటిదేనని అనుకోవాలా? అంటూ ఆర్టిస్టుల్లో మాటా మంతీ సాగుతోంది.

మా సభ్యుల వెల్పేర్ - హెల్త్ నా ప్రధాన కర్తవ్యం.. అంటూ అటువైపు దృష్టి సారించిన విష్ణు సినిమా టెక్కెట్ పైనా మాట్లాడారు. టికెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారు. కానీ నేడు టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు. ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి ...పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ  డిబేట్ చేసుకొవాలి.. అని అన్నారు. మా సభ్యత్వం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టామని కూడా తెలిపారు.

మంచు విష్ణు ఇంకా మరిన్ని విషయాలను ప్రస్థావిస్తూ..మా సభ్యులకు ఎఐజీ వారి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ తో ఆర్టిస్టులకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా పెరొందిన వారు. మా సభ్యులందరు బెనిఫిట్ పొందుతున్నారు... అని అన్నారు. ఈ వేదికపై నరేష్ మాట్లాడుతూ.. మంచు విష్ణు అధ్యకుడైన తరువాత హెల్త్ కి తొలి ప్రాధాన్యతనివ్వడం సంతోషం గా వుంది అని అన్నారు. సభ్యుల అవకాశాల విషయంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశాం. ఆరోగ్యంగా వుంటే అవకాశాలు వస్తాయి. ఇది రెండో హెల్త్ క్యాంప్ అని కూడా తెలిపారు.

అయితే ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఆర్టిస్టుల ఆలోచనలు పరిపరివిధాలుగా సాగాయి. అధ్యక్షుడు అయిన వెంటనే మా బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ లేదు. అసలు మా బిల్డింగ్ నిర్మిస్తారా? ఇప్పుడు మరో ఆరు నెలల్లో భూమి పూజ అంటున్నారు?  అసలు ప్రెసిడెంట్ పోస్ట్ ముగిసే లోపు మా భవంతి నిర్మాణం ప్రారంభిస్తారా? అంటూ గుసగుస వినిపించింది. ఏం జరగనుందో వేచి చూడాలన్న చర్చా సాగింది.