Begin typing your search above and press return to search.

MAA ఎన్నిక‌ల‌పై సందిగ్ధ‌త తొల‌గేదెప్పుడు?

By:  Tupaki Desk   |   25 July 2021 11:30 AM GMT
MAA ఎన్నిక‌ల‌పై సందిగ్ధ‌త తొల‌గేదెప్పుడు?
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించాలి? అన్న‌దానిపై ఇంకా క్లారిటీ మిస్స‌యిన‌ సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత ప‌రిస్థితులు దృష్ట్యా ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ వాయిదా వేయాలా? లేక సెప్టెంబ‌ర్ లో నిర్వ‌హించాలా? అన్న దానిపై కొన్ని రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. అయితే వీట‌న్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేసే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే `మా` క్ర‌మ‌శిక్ష‌ణం క‌మిటీ అధ్య‌క్షులు కృష్ణం రాజు ఇత‌ర క‌మిటీ సభ్యులతో క‌లిసి ఎన్నిక‌ల‌పై ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. కానీ ఆ వివ‌రాల‌న్నిటినీ ప్ర‌స్తుతానికి గోప్యంగా ఉంచారు.

అయితే ఇప్పుడా గోప్య‌త‌కు తెరదించేయ‌నున్నార‌ట‌. ఎన్నిక‌ల‌కు సంబంధించి కార్య‌నిర్వాహ‌క క‌మిటీ ఈ వారంలో వ‌ర్చువ‌ల్ గా స‌మావేశ‌మ‌వ్వ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. బుధ‌వారం లేదా గురువారం నాడు ఈసీతో స‌మావేశం కానున్న‌ట్లు తెల‌సింది. ఈభేటీలో ఎన్నిక‌ల తేదీ వార్షిక జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్,.. స‌భ్యులు జీవిత కాలం భీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం స‌హా ప‌లు ముఖ్య‌మైన అంశాల‌పై చ‌ర్చ‌ జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో కృష్ణంరాజు లీడ్ తీసుకోనున్నారు. ఆయ‌న‌తో పాటు లీగ‌ల్ అడ్వైజ‌ర్ ఆడిట‌ర్ స‌హా ఈ సీ స‌భ్యులు పాల్గొంటారు.

`మా` బైలా ప్ర‌కారం ఈసీ మీటింగ్ ,.. వార్షిక స‌మావేశం (ఏజీఎమ్ )ల మధ్య అంతరం 21 రోజులు ఉండాలి. ఆ విధంగా స‌మావేశం అయ్యేలా ఆగస్టు మూడవ వారంలో వార్షిక‌ స‌మావేశానికి ప్ర‌తిపాదించ‌నున్నారు. అయితే థ‌ర్డ్ వేవ్ ముందు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేమ‌ని ఈసీ ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. కానీ `మా` లో త‌లెత్తిన గంద‌ర‌గోళం న‌డుమ ఒక‌వేళ నిర్వ‌హించాల్సి వ‌స్తే సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రిలీజ్ అయితే ఈసీ ర‌ద్దవుతుంది. ఆ త‌ర్వాత ఎలాంటి స‌మావేశాల‌కు అవ‌కాశం ఉండ‌దు. మ‌రి `మా` త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది వ‌చ్చే వారంలో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

పెద్ద దిక్కు లేర‌ని అన్నారు క‌దా!

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల వార్ లో భాగంగా ఇటీవ‌ల ప‌లువురు మీడియా వేదిక‌గా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌(టాలీవుడ్)కు అస‌లు పెద్ద దిక్కు ఎవ‌రూ లేరు. సినీపెద్ద‌లెవ‌రూ వివాదాల్ని ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్నారు! అనే అభిప్రాయం కొందరిలో వ్య‌క్త‌మైంది. ఎన్టీఆర్ - ఏఎన్నార్ - దాస‌రి నారాయ‌ణ రావు త్రయం అదుపులో ఉంచిన‌ట్టు ప‌రిశ్ర‌మ‌ను వేరొక‌రు ఎవ‌రూ అదుపులో పెట్ట‌లేకపోతున్నార‌నే చిన్న చూపు క‌నిపించింది. ఇప్పుడున్న సినీపెద్ద‌లకు ఇది చేత‌కావ‌డం లేదని వ్యాఖ్య‌లు వినిపించాయి. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో లుక‌లుక‌ల‌పై తలో మాటా అంటున్నారు.

అస‌లు సినీప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కు లేరు! అని ఇటీవ‌ల ఓ యువ‌హీరో సూటిగానే వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్- ఏఎన్నార్ - దాస‌రి హ‌యాంలో వారు ఏం చెబితే అది పరిశ్ర‌మ‌లో వినేవార‌ని ఆ త‌ర్వాత అలాంటిదేమీ లేద‌ని వ్యాఖ్యానించారు. నిజానికి `పెద్ద దిక్కు` అంటూ ఎవ‌రిని టార్గెట్ చేశారు? అన్న‌ది ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం సినీపెద్ద‌ల్లో దీనిపై చర్చ సాగుతోంద‌ని స‌మాచారం. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు- మెగాస్టార్ చిరంజీవి- మంచు మోహ‌న్ బాబు- ముర‌ళీమోహ‌న్ - జ‌య‌సుధ వంటి సీనియ‌ర్ల‌లో దీనిపై చ‌ర్చ సాగుతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మేమెవ‌ర‌మూ స‌రిగా ప‌ని చేయ‌లేక‌పోతున్నార‌నే ఉద్ధేశ‌మేనా ఇది...? అన్న ఆత్మ విమ‌ర్శ చేసుకున్నార‌ట‌. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఆ కామెంట్ల‌కు స‌మాధానం చెప్పేందుకు సినీపెద్ద‌లు రెడీ అవుతున్నార‌ని అది చాచి కొట్టిన‌ట్టు ఉంటుంద‌ని చెబుతున్నారు.