మా సినిమా ఖచ్చితంగా ఆలోచనలు కలిగిస్తుంది

Thu Sep 23 2021 18:00:01 GMT+0530 (IST)

Love story film is definitely thought provoking

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇందులో ఒక మంచి మెసేజ్ తో పాటు మనసును కదిలించే సన్నివేశాలు కూడా ఉంటాయని తేలిపోయింది. బాక్సాఫీస్ వద్ద లవ్ స్టోరీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంతో అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు సినిమా రేంజ్ ను పెంచుతూనే ఉన్నాయి. లవ్ స్టోరీ ప్రమోషనల్ బాధ్యతలు పూర్తిగా తన పై వేసుకున్న సాయి పల్లవి వరుసగా ఇంటర్వ్యూలు వస్తూ వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సాయి పల్లవి సినిమా లోని కంటెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.సమాజంలో ఉన్న లింగ వివక్ష గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాని ఎవరు కూడా సమస్యలపై పూర్తిగా పోరాటం చేస్తున్న వారు లేరు. సినిమాలో హీరోయిన్ మౌనిక తన కలలు సాకారం చేసుకునేందుకు కష్టపడే అమ్మాయి. తన కలలు సాకారం చేసుకోవడంలో ఎక్కడ తక్కువ అంటూ ఆమె తనను తాను ప్రోత్సహించుకుంటూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మౌనిక ముందుకు సాగుతుంది. మన చుట్టు ఉండే కుటుంబాల్లో లింగ వివక్ష చూస్తూనే ఉంటాం. ఆ సమస్యను దర్శకుడు శేఖర్ కమ్ముల చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రతి మనిషి కూడా అనుకున్నది సాధించేందుకు కష్టపడాలి.. అలా విల్ పవర్ తో కష్టపడితే ఖచ్చితంగా విజయం దక్కుతుంది అనేందుకు ఉదాహరణ అన్నట్లుగా నాగ చైతన్య పాత్రను శేఖర్ సర్ చూపించారు.

మా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆలోచించే విధంగా ఉంటుంది అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. మన ఇంట్లో ఉన్న అమ్మాయిల గురించి.. మన చుట్టు ఉన్న అమ్మాయిల గురించి తక్కువ చేసి మాట్లాడటం అనేది తప్పు అని ఈ సినిమా చూసిన తర్వాత కొందరు అయినా మారుతారు అని తాను నమ్ముతున్నాను అంటూ సాయి పల్లవి అభిప్రాయం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా జీవితంలో సాధించగలడు. ఆ విషయాన్ని నమ్మి కష్టపడితే ఏదో ఒక రోజు విజయం దక్కుతుంది.. సక్సెస్ మీ వెంట వస్తుంది అంటూ ఈ సినిమా లో చూపించారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లవ్ స్టోరీ సెకండ్ వేవ్ తర్వాత రాబోతున్న మొదటి పెద్ద సినిమా. కనుక అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.