'లవ్ స్టోరీ' ట్రైలర్: భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమకథ..!

Mon Sep 13 2021 22:46:25 GMT+0530 (IST)

Love story Trailer

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ''లవ్ స్టొరీ''. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని 2021 సెప్టెంబర్ 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెడుతున్న మేకర్స్.. తాజాగా 'లవ్ స్టోరీ' చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునే జుంబా డ్యాన్సర్ రేవంత్ గా నాగచైతన్య ను చూపించడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. మరోవైపు అత్తెసరు మార్కులతో బీటెక్ పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనిక గా సాయి పల్లవి ని చూపించారు. అయితే మౌనికలో దాగి ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ ని గుర్తించిన రేవంత్.. ఆమెను మంచి డ్యాన్సర్ అవ్వాలని ప్రోత్సహిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడగా.. కులాలు ఆస్తులు అంతస్తుల వల్ల పెద్దలు వీరి ప్రేమను అంగీకరించడం లేదని తెలుస్తోంది.

'లవ్ స్టోరీ' ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో అందమైన ప్రేమ కథతోపాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలు కూడా ఉన్నాయని అర్ధమవుతుంది. 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల మరోసారి సున్నితమైన ప్రేమ కథను చెప్పబోతున్నాడని తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ లవ్ స్టోరీ లో నాగచైతన్య - సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. 'బీటెక్ బీటెక్కే.. డ్యాన్స్ డ్యాన్సే.. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవా ని తన జాబ్ అడిగితే దొబ్బేయ్ అంటాడు..' 'మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా' 'బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని చద్దాం' వంటి డైలాగ్స్ అలరిస్తున్నాయి.

'లవ్ స్టోరీ' చిత్రంలో రాజీవ్ కనకాల - దేవయాని - ఈశ్వరీరావు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. మిడిల్ క్లాస్ యువకుడిగా నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. 'సారంగ దరియా' 'ఈ చిత్రం చూడు' వంటి చార్ట్ బస్టర్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిహెచ్.. నేపథ్య సంగీతం కూడా బాగా ఇచ్చాడు. సినిమాటోటగ్రాఫర్ విజయ్ సి కుమార్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మార్తాండ్ కె. వెంకటేష్ ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. మొత్తం మీద ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు.