మళ్లీ ప్రేమలో పడటంపై నాగచైతన్య స్పందన..!

Fri Aug 05 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Love Is What Keeps Us Going Naga Chaitanya

అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో సినిమాలతో కాకుండా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సమంత రూత్ ప్రభు తో విడాకులు తీసుకున్న తర్వాత చైతూ ఒంటరిగా జీవిస్తున్నారు. బాలీవుడ్ మీడియా మాత్రం డివోర్స్ తర్వాత యువసామ్రాట్ మరో ప్రేమని వెతుక్కున్నారని తెగ రూమర్స్ ప్రచారం చేస్తూ వస్తోంది.'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య మీద అక్కడి మీడియా ఫుల్ ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా.. అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలనే ఎక్కువగా అడుగుతున్నారు. ఇప్పటికే అలాంటి వాటికి తనదైన శైలిలో సమాధానమిచ్చారు చైతూ.

అయినప్పటికీ బాలీవుడ్ మీడియా మాత్రం అక్కినేని హ్యాండ్సమ్ హీరోని వదలడం లేదు. అతను మళ్లీ ప్రేమలో పడ్డాడని నిరూపించాలని తెగ ట్రై చేస్తోంది. లేటెస్టుగా నాగచైతన్య కు ఓ ఇంటర్వ్యూలో మళ్లీ ప్రేమను కనుగొనడానికి సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి చై ఎప్పటిలాగే మెచ్యూర్ ఆన్సర్ ఇచ్చారు.

చైతన్య మాట్లాడుతూ.. "అవును.. ఎవరికి తెలుసు. ప్రేమ అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం గాలిని ఎలా పీల్చుకుంటామో అలాగే జీవితంలో ప్రేమ చాలా ముఖ్యమైన భాగం. మనం ప్రేమించాలి.. ప్రేమను స్వీకరించాలి. అదే మనల్ని ఆరోగ్యంగా మరియు పాజిటివ్ గా ఉంచుతుంది" అని తెలిపారు.

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారంటూ ఇటీవల బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. తరచూ కలుస్తున్నారంటూ కథనాలు ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న రూమర్స్ పై చై స్పందించారు. ఇవి వింటుంటే నవ్వొస్తుందని అన్నారు

ఈ మధ్యకాలంలో మీ గురించి వచ్చిన ఏ రూమర్ చూసి నవ్వుకున్నారు? అని చైతూ ని ప్రశ్నించగా.. ''ప్రతివారం నా గురించి ఏదొక రూమర్ వస్తోంది. వాటిని చూస్తే ఫన్నీగా అనిపిస్తోంది. నా జీవితానికి ఎలాంటి సంబంధంలేని విషయాలపైనా ప్రచారాలు జరుగుతున్నాయి. మొదట వాటిని చూసినప్పుడు నవ్వొచ్చినప్పటికీ.. ఇప్పుడైతే వాటిని అసలు పట్టించుకోవడం లేదు" అని వివరించారు. ఈ విధంగా తమ డేటింగ్ రూమర్స్ కు పరోక్షంగా చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.

ఇకపోతే విడాకుల తర్వాత నాగచైతన్య కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నారు. హిందీలో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన 'లాల్ సింగ్ చద్దా' మూవీ ఆగస్ట్ 11న పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండటం విశేషం.

'మానాడు' ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ ఓ బైలింగ్విల్ మూవీ చేస్తున్నారు. ఇందులో అతను ఒక పోలీస్ గా కనిపించనున్నారు. అలానే పరశురామ్ - తరుణ్ భాస్కర్ వంటి పలువురు క్రేజీ దర్శకులు చై తో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'దూత' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.