నాగశౌర్య కు మంచి డేట్ దొరికినట్లేనా..?

Thu Aug 11 2022 18:17:26 GMT+0530 (India Standard Time)

Looks like naga shourya got a good date

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ''కృష్ణ వ్రింద విహారి''. 'అలా ఎలా' ఫేమ్ అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శౌర్య హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు.ఇదొక న్యూ ఏజ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ లభించింది. రొమాన్స్ తో పాటు కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని అర్థమవుతుంది.

అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన 'కృష్ణ వ్రింద విహారి' సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. పాండమిక్ తర్వాత ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత మే 20న వస్తామని అన్నారు.

అయితే పెద్ద సినిమాల కారణంగా నాగశౌర్య రెండుసార్లూ తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో చిన్న మీడియం రేంజ్ సినిమాలన్నీ థియేటర్లలోకి వచ్చేయడంతో.. కృష్ణ వ్రింద కూడా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు.

కానీ సరైన విడుదల తేదీ దొరక్కపోవడం.. జనాలు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో మేకర్స్ వేచి చేసారనే టాక్ ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని లాస్ట్ ఫ్రైడే ప్రూవ్ చేయడంతో.. శౌర్య చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ''కృష్ణ వ్రింద విహారి'' చిత్రాన్ని సెప్టెంబర్ 23న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా.. వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాని రిలీజ్ కు రెడీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదలను అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

ఇకపోతే నాగశౌర్య ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా కనిపించనుండగా.. యంగ్ బ్యూటీ షిర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - సత్య - బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు మంచి బజ్ ని క్రియేట్ చేసాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

గతేడాది 'లక్ష్య' 'వరుడు కావలెను' వంటి సినిమాలతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన నాగశౌర్య.. ''కృష్ణ వ్రింద విహారి'' చిత్రంతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.