రామ్ చరణ్ ను టార్గెట్ చేసిన లోకేష్!

Wed Jan 13 2021 22:00:01 GMT+0530 (IST)

Lokesh targets Ram Charan

‘లోకేష్ కనగరాజ్..’ సౌత్ లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న పేరు ఇది. కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’తో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు.. విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. తమిళంలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ఈ మూవీ.. తెలుగులోనూ సత్తా చాటింది. ఆ సినిమా ఘన విజయంతో విజయ్ సినిమా ఛాన్స్ కొట్టేశాడు లోకేష్.వీరిద్దరి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం.. జనవరి 13న రిలీజ్ అవుతోంది. తమిళంలో ఇప్పుడు ఈ మూవీ మేనియా అంతా ఇంతా కాదు. తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ వస్తాయనే అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ ప్రీ-రిలీజ్ అమ్మకాలు అడ్వాన్స్ బుకింగ్‌లు అసాధారణంగా ఉన్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరుస్తాయంటున్నారు విశ్లేషకులు. కాగా.. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఇటీవల ఇంటర్వ్యూల్లో స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు కనగరాజ్. తాను టాలీవుడ్ సూపర్ స్టార్ రామ్ చరణ్ కు స్టోరీ లైన్ నెరేట్ చేశానని త్వరలో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పాడు లోకేష్. దీంతో.. ‘మాస్టర్’ రిలీజ్ కోసం మెగా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మాస్టర్ సత్తా చాటితే.. లోకేష్ కనగరాజ్ కు మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టే. ప్రస్తుతం కమల్ హాసన్ మూవీ ‘విక్రమ్’కు దర్శకత్వం వహిస్తున్నాడు లోకేష్. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కమల్ సినిమా తర్వాత రామ్ చరణ్ మూవీపై దృష్టి పెట్టనున్నాడు లోకేష్ కనగరాజ్.