Begin typing your search above and press return to search.

లైఫ్ అంటే ఇట్లా ఉండాలని చెబుతున్న 'ఎఫ్ 3' టీమ్..!

By:  Tupaki Desk   |   17 May 2022 3:00 PM GMT
లైఫ్ అంటే ఇట్లా ఉండాలని చెబుతున్న ఎఫ్ 3 టీమ్..!
X
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ''ఎఫ్ 3'' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో 10 రోజుల్లో థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

విక్టరీ వెంకటేష్‌ - మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా బ్లాక్ బస్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ''ఎఫ్ 3''. ఇందులో తమన్నా భాటియా - మెహరీన్‌ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్‌ చౌహాన్‌ కీలక పాత్రలో కనిపించనుంది. పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ లో ఆడిపాడనుంది.

ఇప్పటికే విడుదలైన 'ఎఫ్ 3' ట్రైలర్ మరియు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా' అనే పార్టీ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. 'హాత్ మే పైసా.. మూతిమే సీసా.. పోరీతో సల్సా.. రాతిరంతా జల్సా.. అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫుట్-ట్యాపింగ్ ఫన్ నంబర్ కు ట్యూన్ కంపోజ్ చేశారు. పార్టీ థీమ్‌ తో డిజైన్ చేసిన ఈ పాటలో వెంకీ - వరుణ్ లతో కలిసి పూజా హెగ్డే వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. రాజు సుందరం మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు.

స్పైసీ సైరన్ పూజా ఈ పాటలో పొట్టి పొట్టి దుస్తుల్లో గ్లామర్ విందును అందిస్తోంది. సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు పలువురు సినీ ప్రముఖులు సెట్స్ కు విచ్చేసినట్లు లిరికల్ వీడియోలో కనిపిస్తోంది. చిత్రీకరణ అంతా చాలా సరదాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగినట్లు తెలుస్తుంది.

లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా అనే ఈ పాట ద్వారా ప్రతీ వ్యక్తి పెద్ద పెద్ద కలలు కనాలని.. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశాన్ని ఇస్తున్నారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ దీనికి క్యాచీ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్ మరియు గీతా మాధురి కలిసి హై పిచ్ లో ఆలపించారు.

'ఎఫ్ 3' చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ప్రాంఛైజీలో ఈ సినిమా రూపొందింది. సాయి శ్రీరామ్ దీనికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.