ప్రభాస్ - నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కోసం లెజెండరీ డైరెక్టర్..!

Mon Sep 21 2020 15:40:29 GMT+0530 (IST)

Legendary director for Prabhas - Nag Ashwin project

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే హీరోయిన్ గా నటించనుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ మూవీ కోసం లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా వర్క్ చేయనున్నారు. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే దర్శకులలో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్ కి స్క్రిప్ట్ మెంటర్ గా వ్యవహరించనున్నారు. నేడు సింగీతం బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా తెలియజేస్తూ ''మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల ఇప్పటికి నెరవేరనుంది. సింగీతం శ్రీనివాసరావు గారును మా ఎపిక్ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ ఖచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి'' అని తెలిపారు.కాగా సింగీతం శ్రీనివాసరావు 'మయూరి' 'పుష్పక విమానం' 'ఆదిత్య 369' 'మైఖేల్ మదన్ కామరాజు' 'భైరవద్వీపం' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అలాంటి గొప్ప దర్శకుడు ప్రభాస్ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా ఉండటం విశేషమనే చెప్పాలి. సింగీతం శ్రీనివాస్ గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారని.. క్వారంటైన్ పీరియడ్ లో కూడా చిత్ర యూనిట్ తో కలిసి ఉన్నాడని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షనల్ జోనర్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ నీవు దృష్టిలో పెట్టుకొని పలు భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. గతంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను సినీ ప్రేక్షకులకు అందించిన వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ వారు ఈ చిత్రాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు.