Begin typing your search above and press return to search.

ఆ ముద్ర ఇష్టం లేకే ఎల్బీ శ్రీ‌రాం దూర‌మ‌య్యారా?

By:  Tupaki Desk   |   5 Dec 2022 2:30 AM GMT
ఆ ముద్ర ఇష్టం లేకే ఎల్బీ శ్రీ‌రాం దూర‌మ‌య్యారా?
X
విభిన్న‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు హాస్య న‌టులు ఎల్బీ శ్రీ‌రామ్‌. `ఏప్రిల్ 1 విడుద‌ల‌`తో చిన్న పాత్ర‌తో న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయ‌న `కోకిల‌` నుంచి సొంత ఊరు వ‌ర‌కు దాదాపు ప‌ద‌కొండు సినిమాల‌కు పైనే డైలాగ్ ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `హిట్ల‌ర్‌`, నాగార్జున న‌టించిన `వార‌సుడు`, `హ‌లో బ్ర‌ద‌ర్‌`, రాజ‌శేఖ‌ర్ న‌టించిన `ఓంకారం`, రాజేంద్ర ప్ర‌సాద్ `అప్పుల అప్పారావు` వంటి సినిమాలున్నాయి.

ఇ.వి.వి స‌త్య‌నారాయ‌ణ తెర‌కెక్కించిన `అమ్మో ఒక‌టో తారీఖు` సినిమాతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారిన ఎల్బీ శ్రీ‌రామ్ ఆ త‌రువాత కూడా హాస్య న‌టుడిగానే కొన‌సాగారు. అయితే ఆయ‌న గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. ల‌ఘు చిత్రాల్లో మాత్ర‌మే క‌నిపిస్తూ వ‌స్తున్నారు. ఇంత‌కీ ఆయ‌న సినిమాల‌కు దూరంగా వుండ‌టానికి గ‌ల కార‌ణం ఏంటీ? .. ఎందుకు సినిమాల‌కు దూరంగా వుంటున్నారు? ..ఏ కార‌ణం చేత ఆయ‌న సినిమాలు చేయ‌డం లేదు.. అనే విష‌యాల‌పై తాజాగా ఎల్బీ శ్రీ‌రామ్ వివ‌ర‌ణ ఇచ్చారు.

అమ‌లాపురంలో అమ‌ర గాయ‌కుడు ఘంట‌సాల శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా అమ‌లా పురం వెళ్లిన ఎల్బీ శ్రీ‌రాం ఆదివారం ఘంట‌సాల విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అంత‌కు ముందు అక్క‌డి ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో మాట్లాడిన ఎల్బీ శ్రీ‌రాం ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ని వెల్ల‌డించారు. నాకు న‌చ్చ‌నిది ఏదైనా వ‌దులుకుంటాన‌ని, న‌చ్చిన చోటే సంతృప్తిగా జీవిస్తాన‌న్నారు. ప‌దేళ్ల పాటు సినిమాల్లో వివిధ పాత్ర‌ల్లో హాస్య న‌టుడిగా న‌టించాన‌న్నారు.

23 ఏళ్ల క్రితం అవ‌కాశాల కోసం ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని, హాస్య న‌టుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా త‌న‌ని ఇండ‌స్ట్రీ గుర్తించింద‌న్నారు. `అమ్మో ఒక‌టో తారీఖు` సినిమా ద్వారా త‌న‌లోని కొత్త న‌టుడిని ఇండ‌స్ట్రీ చూసింద‌న్నారు. ఇంత వ‌ర‌కు వివిధ పాత్ర‌ల్లో 500 కు పైగా సినిమాలు చేశాన‌న్నారు. గ‌త ఆరేళ్లుగా తాను ఇండ‌స్ట్రీకి దూరంగా ఎందుకు వుంటున్నాడో ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. హాస్య న‌టుడి ముద్ర నుంచి బ‌య‌టికి రావ‌డం కోస‌మే తాను సినిమాలుకు దూరంగా వుంటున్నాన‌న్నారు.

అంద‌దుకే సందేశాత్మ‌కంగా వుండే ల‌ఘు చిత్రాల నిర్మాణంపై దృష్టి పెట్టాన‌ని అందుకే సినిమాల‌కు దూరంగా వుంటాన‌న్నారు. ఈ ఆరేళ్ల‌లో 60 ల‌ఘు చిత్రాలు నిర్మించాన‌న్నారు. తాను ఇండ‌స్ట్రీలో వున్న స‌మ‌యంలో దాదాపు 40 మంది హాస్య న‌టులు వుండేవార‌ని, అందులో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నాన‌న్నారు. ఇప్పుడు స‌మాజ హితం కోసం ల‌ఘు చిత్రాల‌ని నిర్మిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.