సాహో ఇంకా చెక్కుతూనే ఉంటారా ?

Mon Jul 15 2019 10:42:45 GMT+0530 (IST)

రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో రిలీజ్ కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇప్పటి నుంచి సరిగ్గా 30 డేస్ లెక్కబెట్టుకుంటే చాలు సాహో థియేటర్లలోకి అడుగు పెడుతుంది. ఇప్పటిదాకా ప్రమోషన్ కు సంబంధించి ఎలాంటి ఊపు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో దీని గురించే అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే సాహో షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని ఫిలిం నగర్ టాక్.బాలన్స్ ప్యాచ్ వర్క్ ని ఫిలిం సిటీలో తీస్తున్నారట. అది అయ్యాక గుమ్మడి కాయ కొట్టేసి పబ్లిసిటీ మొదలుపెట్టే ప్లాన్ లో యువి సంస్థ ఉన్నట్టు తెలిసింది. రెండేళ్లుగా షూటింగ్ జరుగుతున్నా రిలీజ్ కు ఇంత దగ్గరలో ఇంకా చేస్తూనే ఉండటం పట్ల ప్రభాస్ కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా వినికిడి. బాహుబలి తనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినా దాని వల్లే అంచనాలు పెరిగిపోయి సాహో బడ్జెట్ తో పాటు టైం కూడా విపరీతంగా పెరిగిపోయింది.

నాలుగు సినిమాలు చేసే బదులు కేవలం ఒక్కదానితో సర్దుకుని పోవాల్సి వస్తోంది. దీని వల్ల ఇండస్ట్రీ హిట్ అయితే తప్ప బయ్యర్లు సేఫ్ కాలేని స్టేజికి ప్రభాస్ మూవీస్ వచ్చేశాయి. అయితే ఎంత పెద్ద స్టార్ అయినా ప్రతిసారి బాహుబలి రిజల్ట్ అందుకోలేడు కదా. అందుకే సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇకపై వంద కోట్లు  రెండేళ్లు లాంటి లెక్కలు పెట్టుకోకుండా కథ నచ్చితే చాలు ప్రొసీడ్ అవ్వాలనే ఆలోచనలో డార్లింగ్ ఉన్నట్టు టాక్. సాహో ఫలితం మీద అందుకే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది