Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్ తో లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న శౌర్య..!

By:  Tupaki Desk   |   4 Dec 2021 11:48 AM GMT
ప్రమోషన్స్ తో లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న శౌర్య..!
X
యంగ్ అండ్ ఎనెర్జిటిక్ హీరో నాగ శౌర్య నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''లక్ష్య''. 'సుబ్రహ్మణ్యపురం' ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ప్రాచీన విలువిద్య (ఆర్చరీ) నేపథ్యంలో తెరకెక్కుతున్న మొట్ట మొదటి సినిమా. శౌర్య కెరీర్ లో మైలురాయి 20వ చిత్రం. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ సినిమాని డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు.

ఇప్పటికే 'లక్ష్య' చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే ఇటీవల రిలీజ్ చేయబడిన ట్రైలర్ సినిమాపై అంచనాలు కలిగించింది. ఈ క్రమంలో తాజాగా 'సాయా సాయా' అనే పాటను యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు. 'ఆకాశమే తలే ఎత్తెనే.. నా ప్రేమ కొలిచేందుకే.. భూగోళమే.. పెంచే వేగమే.. నిన్ను నన్ను కలిపేందుకే..' అంటూ సాగిన ఈ గీతం వీక్షకులను అలరిస్తోంది.

ప్రేమలో మునిగి తేలుతున్న నాగ శౌర్య - కేతిక శర్మ ల మధ్య చిత్రీకరించిన ఈ పాట వారి ప్రేమ గాఢతను తెలియజేస్తోంది. రొమాంటిక్ సీన్స్ లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు అర్థం అవుతోంది. కీరవాణి తనయుడు కాలభైరవి ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. లిరిసిస్ట్ కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. జునైద్ కుమార్ ఆలపించారు. యువ గాయకులు దినకర్ - రోహిత్ ఈ పాటలో గొంతు కలిపారు.

ఇకపోతే 'లక్ష్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు ఆదివారం గ్రాండ్ గా నిర్వహించడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల - వర్సటైల్ హీరో శర్వానంద్ లతో పాటుగా మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారని మేకర్స్ వెల్లడించారు. వీరితో పాటుగా పలువురు సినీ ప్రముఖులు - చిత్ర యూనిట్ పాల్గొననున్నారు.

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ పతకాలపై 'లక్ష్య' సినిమా రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సృజన మని డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో విలక్షణ నటులు జగపతి బాబు - సచిన్ కెడ్కర్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల 'వరుడు కావలెను' సినిమాతో అలరించిన నాగ శౌర్య.. 'లక్ష్య' చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. మరి యువ హీరోకి ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.