ఫ్రస్టేషన్ తోనే రైటర్లు దర్శకులవుతున్నారు!

Mon Jul 15 2019 20:00:01 GMT+0530 (IST)

దర్శకులుగా మారిన రైటర్లు అందరూ సంచలనాలు సృష్టించలేదు. స్టార్ రైటర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్- కొరటాల శివ దర్శకులుగా మారి బ్లాక్ బస్టర్ సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే వీళ్ల బాటలోనే కొందరు రచయితలు దర్శకులుగా మారి ఫెయిలైన సందర్భాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే రచయితలు దర్శకులుగా మారితే వారికి క్రియేటివిటీ పరంగా తెరపై అనుకున్నది అనుకున్నట్టు చూపించుకునే వెసులు బాటు ఉంటుంది. ఆ ఒక్క కారణంతో చాలా మంది రచయితలు దర్శకులుగా మారుతున్నారు.అయితే ఇదే విషయాన్ని రచయిత లక్ష్మీ భూపాల్ సైతం అంగీకరించారు. 15 ఏళ్ల కెరీర్ స్పాన్ లో దాదాపు 50-60 చిత్రాలకు మాటల రచయితగా పని చేసిన లక్ష్మీ భూపాల్ ఇటీవలే రిలీజైన `ఓ బేబి` చిత్రానికి చక్కని సెన్సిబుల్ డైలాగుల్ని అందించారన్న పేరొచ్చింది. చాలా చోట్ల ఆయన డైలాగ్స్ జనాల మనసులను తాకాయి. ఇతరుల్లానే మీరు కూడా దర్శకుడవుతారా? అని ప్రశ్నిస్తే... ఆయన చేసిన ఓ వ్యాఖ్య సూటిగా తాకుతోంది.

కొందరు రచయితలు ఫ్రస్ట్రేషన్ లో దర్శకులవుతున్నారు. తాము రాసినది దర్శకులు సరిగా ఆవిష్కరించడం లేదనే కోపంలో దర్శకులుగా మారుతున్నారు. నేను ఫ్రస్ట్రేషన్ లోనో కోపంలోనో దర్శకుడు కావాలని అనుకోవడం లేదు. నేను మాత్రమే కథకు న్యాయం చేయగలని భావించిన రోజున మెగాఫోన్ చేపడతానని తెలిపారు. ప్రస్తుతం తనవద్ద 24 కథలు ఉంటే అందులో ఆరు కథల్ని తాను దర్శకత్వం వహించే సినిమా కోసం దాచి పెట్టుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రైటర్ల కెరీర్ చాలా బావుందని... మాయావి త్రివిక్రమ్ పారితోషికాల పరంగా రచయితలకు ఓ ప్యారామీటర్ ను సెట్ చేశారని లక్ష్మీ భూపాల్ కితాబిచ్చారు.