బేబమ్మ పట్టిందల్లా బంగారమే..!

Tue Jan 18 2022 13:04:33 GMT+0530 (IST)

Kriti Shetty Upcoming Movies

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. తొలి చిత్రంతోనే యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మకు క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. అయితే అమ్మడు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలూ మంచి విజయం సాధించడం విశేషం.వాస్తవానికి 'ఉప్పెన' సినిమా కోసం ముందుగా వేరే హీరోయిన్ ని తీసుకొని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే దర్శకుడు బుచ్చిబాబు ఆమెను తప్పించి చివరకు కృతి శెట్టి ని మెగా మేనల్లుడి డెబ్యూ మూవీలోకి తీసుకున్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాదు.. కృతికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలో క్రేజీ ప్రాజెక్ట్స్ అమ్మడి తలుపు తట్టడంతో.. వరుస సినిమాలకు కమిట్ అవుతూ వచ్చింది కృతి శెట్టి. ఇటీవల 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బేబమ్మ.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నిజానికి ఈ సినిమాలో కృతి పాత్రకు యావరేజ్ మార్కులే పడ్డాయి. కాకపోతే నానితో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసి యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఏదైతేనేం రెండో సినిమా కూడా సక్సెస్ అవడంతో లక్కీ బ్యూటీగా మారిపోయింది.

ఇదే క్రమంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన 'బంగార్రాజు' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. టాక్ తో సంబంధం లేకుండా భారీ ఫిగర్స్ నమోదు చేస్తోంది. దీంతో కృతి అకౌంట్ లోకి మరో హిట్ వచ్చి చేరింది.

'బంగార్రాజు' చిత్రంలో చైతన్య కు జోడీగా.. సర్పంచ్ నాగలక్ష్మి క్యారక్టర్ లో కనిపించిన కృతి శెట్టి.. నటన పరంగా పర్వాలేదనిపించింది. అంతేకాదు తొలిసారిగా ఈ సినిమాలో అమ్మడికి డ్యాన్స్ చేసే అవకాశం లభించింది. ఆమె పాత్రకు పెద్దగా పేరు రాకపోయినా.. అదృష్టం కలిసి రావడంతో హ్యాట్రిక్ విజయాన్ని తన అకౌంట్ లో వేసుకుంది.

కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న 'ది వారియర్' అనే తెలుగు తమిళ బైలింగ్విల్ యాక్షన్ మూవీ చేస్తోంది. అలానే నితిన్ తో కలిసి 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలో నటిస్తోంది కృతి. మరి ఈ మూడు చిత్రాలకు కూడా అమ్మడి లక్ కలిసొచ్చే బ్లాక్ బస్టర్స్ అవుతాయేమో చూడాలి.