ఇక ఇప్పుడు 'రొమాంటిక్' పిల్ల వంతు!

Sun Mar 07 2021 10:00:01 GMT+0530 (IST)

Kriti Shetty Upcoming Movie

తెలుగు తెరకి ఈ ఏడాది పరిచయమవుతున్న కుర్ర హీరోయిన్లలో కృతి శెట్టి .. కేతిక శర్మ .. అనన్య పాండే పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈ ముగ్గురిలో కృతి శెట్టి కథానాయికగా నటించిన 'ఉప్పెన' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా థియేటర్లను దడదడలాడించేసింది. కృతి శెట్టిని చూసిన ప్రేక్షకులు అందం అంటే ఇది .. ఆకర్షణ అంటే ఇది అనేసి చెప్పుకున్నారు. బాలు పాడుతుంటే బాపు గీసిన బొమ్మలా ఉందని మరికొందరు అన్నారు. అంతలా ఈ బ్యూటీ .. కుర్రాళ్ల మనసు సరస్సులో పిల్ల హంసలా వాలిపోయింది.'ఉప్పెన' సినిమాలో మంచి కథాకథనాలు ఉండొచ్చు .. మనసు తలుపు తట్టే పాటలు ఉండొచ్చు .. వైష్ణవ్ తేజ్ నటన గొప్పగా ఉండొచ్చు .. విజయ్ సేతుపతి అద్భుతంగా చేసి ఉండొచ్చు. కానీ అసలు థియేటర్ కి జనాలను రప్పించిన క్రెడిట్ కృతి శెట్టికే దక్కుతుందనేది అందరూ చెప్పుకునేమాట. ఇప్పుడు ఈ సినిమా వసూళ్ల పరంగా 100 కోట్ల గ్రాస్ ను దాటేసింది. అందువల్లనే అభిమానులంతా ఇప్పుడు ఈ అమ్మాయిని 100 కోట్ల పిల్లగానే పిలుచుకుంటున్నారు. ఒక హీరోయిన్ తన అందచందాలతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారడం .. ఆ సినిమాను జనం గుండెలకి దగ్గర తీసుకెళ్లడం ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయి విషయంలోనే జరిగింది.

సాధారణంగా 'ఉప్పెన' వస్తే ఆస్తులన్నీ కొట్టుకుపోతాయి .. కానీ ఈ 'ఉప్పెన'కి 100 కోట్ల గ్రాస్ కొట్టుకు రావడం విశేషం. 'ఉప్పెన' పిల్ల ఊహలపై రైట్స్ ఇచ్చేసినందుకు హ్యాపీగా ఫీలవుతున్న కుర్రాళ్లు నెక్స్ట్ 'కేతిక శర్మ' వంతు అంటూ 'రొమాంటిక్' సినిమాపై దృష్టి పెట్టారు. ఆకాశ్ పూరి హీరోగా రూపొందిన 'రొమాంటిక్' సినిమా ద్వారా ఈ అమ్మాయి త్వరలో టాలీవుడ్ స్క్రీన్ ను టచ్ చేయనుంది. సెగలు పుట్టించే సొగసులు .. మనసులు మరిగించే చూపులు .. పోటెత్తిన పరువాలు ఈ పిల్ల సొంతం. అందం ముచ్చటపడి తనపై హక్కులన్నీ రాసిచ్చేసినట్టుగా ఈ అమ్మాయి కనిపిస్తుంది. కృతి శెట్టి తరువాత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే వంతు ఈ పిల్లదేనని కుర్రాళ్లు భావిస్తున్నారు. వాళ్ల కలల కోటపై ఈ పిల్ల ఏ రేంజ్ లో దాడి చేస్తుందో .. బాక్సాఫీస్ బద్ధకాన్ని ఏ స్థాయిలో వదిలించేస్తుందో చూడాలి.