Begin typing your search above and press return to search.

ఆయన చలువతోనే రెబల్ స్టార్ అయ్యారట

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:46 AM GMT
ఆయన చలువతోనే రెబల్ స్టార్ అయ్యారట
X
మేలు చేసినోడ్ని చాలామంది మర్చిపోతుంటారు.కానీ.. అందుకు భిన్నంగా కొందరుంటారు. తాము పొందిన మేలును.. తామెంత స్థాయికి చేరుకున్నా అస్సలు మర్చిపోలేరు. తనకు రెబల్ స్టార్ గుర్తింపు రావటమే కాదు.. ఈ రోజున కృష్ణంరాజుకు ఉన్న గుర్తింపు వెనుక ఒక వ్యక్తి ఉన్నారని.. ఆయనిచ్చిన సలహానే తానీ స్థాయికి చేరుకునేలా చేసిందంటూ తాజాగా చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

ఇంతకీ కృష్ణంరాజు నోట వచ్చిన మాటలు ఎవరిని ఉద్దేశించినవి? అన్నది చూస్తే..భారత చలనచిత్ర పితామహుడు.. మూకీ యుగం నుంచి డిజిటల్ మూవీస్ వరకూ నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా.. ఎగ్జిబిటర్ గా.. ఫిలిం ల్యాబ్ అధినేతగా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఎల్వీ ప్రసాద్. ఆయన 112వ జయంతి హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు హాజరయ్యారు. తానీ స్థాయికి చేరటానికి ఎల్వీ ప్రసాద్ అని చెప్పుకొచ్చారు. ఆయనతో తనకున్న అనుబంధం గురించి చెప్పిన కృష్ణంరాజు.. అప్పట్లో ఆయన ఇచ్చిన సలహానే తానీ రోజున ఉన్న స్థాయికి కారణంగా చెబుతూ.. నాటి సీక్రెట్ ను రివీల్ చేశారు.

తాను చేసిన ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని.. ఆ టైమ్‌లో సినీ పరిశ్రమ వదిలేసి తిరిగి వెళ్ళిపోదామని కృష్ణంరాజు భావించారట. ఆ టైంలోనే ‘నేనంటే నేనే’ సినిమా కోసం డూండీ సంప్రదించారని.. అయితే ఆ మూవీలో మూడు పాత్రలు ఉండటం.. తనది కాస్త విలనీ షేడ్స్ ఉండటంతో తాను నో చెప్పానని చెప్పారు.

ఆ టైంలోనే తాను ఎల్వీ ప్రసాద్ ను కలిశానని.. ఆయనకు తన నిర్ణయం చెబితే సరికాదన్న విషయాన్ని చెప్పారు. ‘సినిమాలో నువ్వు హీరోవా? విలన్‌వా? రాజువా? పేదవా? అన్నది కాదు.. ఆ పాత్ర ద్వారా నువ్వు ఆడియన్స్‌కి ఎంత దగ్గరయ్యావన్నదే ముఖ్యం. ఎన్టీఆర్ చూడు హీరోయిన్ ప్రధాన పాత్ర అయినా సరే గుడ్డివాడుగా, కుంటివాడిగా అన్ని విధాలా పాత్రలు చేసి మెప్పించాడని చెప్పి.. వచ్చిన అవకాశాన్ని మిస్ కావొద్దని చెప్పారన్నారు.

ఆయన సలహాతో తాను డూండీని కలిసి.. కొన్ని మార్పులతో తాను ఆ సినిమా చేస్తానని చెప్పటం.. అందుకు ఓకే అనటంతో ఆ సినిమా చేశానన్నారు. ఆ సినిమా సక్సెస్ కావటమే కాదు.. తన పాత్రకు గుర్తింపు లభించిందని చెప్పారు. తానీ రోజున ఈ స్థాయికి చేరానంటే ఆ రోజున ఎల్వీ ప్రసాద్ ఇచ్చిన సలహానే అంటూ కృష్ణంరాజు పాత విషయాల్ని రివీల్ చేశారు. రెబల్ స్టార్ మాటల్ని ఈ తరం హీరోలు వింటే బాగుంటుందేమో?