Begin typing your search above and press return to search.

'హిజ్రా' పాత్ర చేయడానికి చాలా టెన్షన్ పడిపోయాను: కోట శ్రీనివాసరావు

By:  Tupaki Desk   |   15 Oct 2021 1:30 AM GMT
హిజ్రా పాత్ర చేయడానికి చాలా టెన్షన్ పడిపోయాను: కోట శ్రీనివాసరావు
X
తెలుగు తెరపై విరుగుడు లేని విలనిజానికి కోట శ్రీనివాసరావు కేరాఫ్ అడ్రెస్. విలనిజంలో ఆయన చూపించిన మార్క్ ను అంత తొందరగా ఎవరూ మరిచిపోలేరు. నాటకాల నుంచి వచ్చిన కారణంగా, పాత్రను అర్థం చేసుకుని పరకాయ ప్రవేశం చేయడం ఆయనకి బాగా తెలుసు. డిఫరెంట్ గా ఉండే ఆయన డైలాగ్ డెలివరీనీ .. బాడీ లాంగ్వేజ్ ను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. యూత్ నుంచి వచ్చిన హీరోనైనా .. మాస్ మెచ్చే హీరోనైనా కంటిచూపుతో కంగారు పెట్టేసే విలన్ ఆయన. అలాంటి ఆయన నటుడిగా తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

అందులో భాగంగా ఆయన 'రెండిళ్ల పూజారి' సినిమాలో తాను పోషించిన 'హిజ్రా' పాత్రను గురించి ప్రస్తావించారు. 'అలెగ్జాండర్' సినిమా తరువాత నేను సుమన్ గారి కాంబినేషన్లో చేసిన సినిమా 'రెండిళ్ల పూజారి'. ఈ సినిమాలో నేను 'హిజ్రా' పాత్రను పోషించాను. ముందుగా ఈ పాత్ర కోసం తనికెళ్ల భరణిని అడిగారట. ఈ పాత్రను తనకంటే కోట చేస్తేనే బాగుంటుందని చెప్పి, వాళ్లను నా దగ్గరికి పంపించాడు. నాటకాలు వేసే రోజుల నుంచే నాకు తనికెళ్ల భరణి తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. కలిసి నాటకాలు వేశాము .. కలిసి నాటకాలను గురించి చర్చించుకునే వాళ్లం.

ఒక్కసారి నాటకాలను గురించి మాట్లాడుకుంటూ మా రూమ్ లోనే ఉండిపోయాడు. భరణి మంచి నటుడే కాదు .. మంచి రచయిత కూడా. పేపరుపై పెన్ను పెడితే సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా రాసే సత్తా ఉన్న రచయిత. అలాంటి భరణి ఆ హిజ్రా వేషాన్ని నా కోసం పంపించాడు. చేస్తానని చెప్పి వాళ్లను పంపించాను .. ఆ తరువాత నుంచే టెన్షన్ పట్టుకుంది. అప్పటికి నేను మంచి వయసులో ఉన్నాను .. అలాంటి నా బాడీలో ఆ లక్షణాలు ఎలా పలికించాలి? డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి? వాళ్లలా ఎలా నడవాలి? ఇలాంటి ఆలోచనలన్నీ బుర్రలోకి రావడంతో టెన్షన్ ఇంకాస్త పెరిగింది.

'హిజ్రా' పాత్రను ఎలా చేయాలి? ఎలా పండించాలి? అనే ఒక అంతర్మథనంలో నేను ఉండగా, నాకు అన్నగారు చేసిన 'నర్తనశాల' సినిమా గుర్తుకు వచ్చింది. అంతటి గొప్ప పర్సనాలిటీతో ఆయన 'బృహన్నల' పాత్రను చేశారు. ఆ సినిమాను అప్పటికే చాలాసార్లు చూశాను. కానీ ఆ తరహా పాత్రను చేయవలసి వచ్చేసరికి మళ్లీ మళ్లీ చూశాను. ఇంత కష్టతరమైన పాత్రను అన్నగారు ఎంత సునాయాసంగా చేశారు? అనిపించింది. ఆయనలా చేయడానికి ప్రయత్నిస్తే ప్రేక్షకులను మెప్పించవచ్చనే నమ్మకం కలిగింది. అప్పుడు గానీ మనసు కుదుటపడలేదు .. కంటికి కునుకుపట్టలేదు" అంటూ ఆయన అప్పటి విషయాలను .. విశేషాలను గుర్తుచేసుకున్నారు.