డిజాస్టర్ దెబ్బకు కొత్త టీమ్ ని వెతుకున్నాడా..?

Sun May 22 2022 09:06:08 GMT+0530 (IST)

Koratala Siva Looking for a new team

'మిర్చి' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన రచయిత కొరటాల శివ.. 'శ్రీమంతుడు' 'జనతా గ్యారేజ్' 'భరత్ అనే నేను' చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అయితే అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగిన కొరటాల.. ఇటీవల 'ఆచార్య' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చవిచూసారు.మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన 'ఆచార్య' చిత్రం తీవ్ర నిరాశ పరిచింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మూడు నాలుగు రోజులకే చతికిల పడిపోయింది. అసలు ఇది కొరటాల సినిమానేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఒక్క ప్లాప్ తో ఎన్నడూ లేని విధంగా నెగిటివిటీని కూడగట్టుకున్న దర్శకుడు.. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కోసం కొత్త టీమ్ ని ఎంచుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. మొన్ననే #NTR30 కు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా టెక్నికల్ టీమ్ ని ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ - సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు - ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ - ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ లను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. అయితే ఇందులో ఎడిటర్ మినహా మిగతా వారంతా కొరటాలతో ఫస్ట్ టైం వర్క్ చేయబోతున్నారు.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన మొదటి నాలుగు సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. 'ఆచార్య' చిత్రానికి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ను ఎంచుకున్నారు. అయితే ఈ సినిమా పాటలు కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

ఇక ఇప్పటి వరకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ ఆర్. మది మరియు తిరు లతో మాత్రమే దర్శకుడు పని చేశారు. 'ఆచార్య' కు కూడా తిరు నే కంటిన్యూ చేశారు. అయితే ఈ సినిమా విజువల్స్ సరైన స్థాయిలో లేవనే ఆరోపణలు వచ్చాయి. ఓపెనింగ్ షాట్లు - ఎలివేషన్ షాట్లు ఏవీ కొరటాల మునుపటి చిత్రాలలో వలె ఆసక్తికరంగా లేవని అన్నారు.

ఈ విషయంలో దర్శకుడికి డీఓపీ కొత్త ఐడియాలు ఇవ్వలేదని.. వారి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడమే దీనికి కారణమనే పుకార్లు వినిపించాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. 'ఆచార్య' సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకున్న తర్వాత కొరటాల శివ.. #NTR30 కోసం కొత్త టీమ్ ని వెతుకున్నాడని అర్థం అవుతోంది.

ఇప్పటి వరకు తన విజయాలలో భాగమైన దేవిశ్రీ - మాధి ని పక్కనపెట్టి.. తొలిసారిగా అనిరుధ్ - రత్నవేలు లతో వర్క్ చేయడానికి రెడీ అయ్యారు కొరటాల. అదే సమయంలో ఆర్ట్ మరియు కాస్ట్యూమ్స్ ను చూసుకోవడానికి ఫస్ట్ టైం ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ని తీసుకువచ్చారు. మరి కొత్త బృందంతో కొరటాల ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.