'సమ్మతమే' లోని ఎనర్జిటిక్ డ్యూయెట్ సాంగ్.. 'కృష్ణ అండ్ సత్యభామ'..!

Mon Nov 29 2021 11:32:14 GMT+0530 (IST)

Kiran Abbavaram Sammathame Lyrical Song Out

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'రాజావారు రాణిగారు' SR కళ్యాణమండపం' సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు అర్బన్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన “సమ్మతమే” అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.'సమ్మతమే' చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన 'కలర్ ఫోటో' ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ - ఫస్ట్ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా 'కృష్ణ & సత్యభామ' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'నేనూహించలే.. నేను అనుకున్న అమ్మాయి నువ్వేనని అసలు ఊహించలే..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. కృష్ణ సత్యభామ ప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో.. కిరణ్ - చాందినిల మధ్య ప్రేమ కూడా చూడముచ్చటగా ఉంటుందని ఈ రొమాంటిక్ ట్రాక్ ద్వారా తెలుస్తోంది.

శేఖర్ చంద్ర ఈ ఎనర్జిటిక్ డ్యూయెట్ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేశారు. తెలుగు మరియు ఆంగ్ల పదాల కలయికతో లిరిసిస్ట్ కృష్ణకాంత్ ఈ గీతానికి సాహిత్యం అందించారు. యాజిన్ నజీర్ మరియు శిరీషా భాగవతుల తమ ఆహ్లాదకరమైన గానంతో ఈ పాటను మరింత మనోహరంగా మార్చారు.

'సమ్మతమే' చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. విభిన్నమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.