అలరిస్తోన్న కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' ఫస్ట్ గ్లిమ్స్..!

Thu Oct 21 2021 10:53:20 GMT+0530 (IST)

Kiran Abbavaram's 'Sammathame' First Glimpse Out

'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. విలక్షణమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. మొదటి సినిమా ఒక రస్టిక్ రొమాంటిక్ డ్రామా అయితే.. రెండవ చిత్రం 'SR కళ్యాణమండపం' ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఈ రెండు సినిమాలూ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న యువ హీరో.. ఇప్పుడు “సమ్మతమే” అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో కిరణ్ సరసన 'కలర్ ఫోటో' ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే విడుదలైన "సమ్మతమే" టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసారు. అర్బన్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ మూవీ గ్లిమ్స్ హీరోహీరోయిన్ల విభిన్న పాత్రలను చూపిస్తోంది. కిరణ్ అబ్బవరం మంచి మృదువైన స్వభావం కలిగిన యువకుడిగా కనిపిస్తుంటే.. అతని సహోద్యోగి చాందిని చౌదరి మాత్రం ఈ ట్రెండ్ తగ్గ యువతిగా చిల్ ఔట్ టైప్ లో కనిపిస్తోంది. ఇందులో ఆమె డ్రింక్ చేయడం స్మోకింగ్ చేయడాన్ని గమనించవచ్చు.

అయితే కిరణ్ ఇబ్బందిని అర్థం చేసుకున్న చాందిని.. 'పాటను పాటలా కాకుండా మాటలా మాట్లాడాలి.. పాటలా పాడితే ఒడిపోయినట్లు' అంటూ కండిషన్ పెట్టి ఓ సరికొత్త గేమ్ ప్లాన్ తో ముందుకు వచ్చింది. 'కొత్త కొత్తగా ఉన్నది. స్వర్గం ఇక్కడే అన్నది' 'కనులు కలపవాయే మనసు తెలపవాయే..' అంటూ ఇద్దరూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే కొన్ని మెలోడీ రొమాంటిక్ పాటలను మాటల రూపంలో చెప్పడం కనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం మరియు చాందిని చౌదరి ఇద్దరూ కృష్ణ - సత్యభామ పాత్రలలో బాగున్నారు.

దర్శకుడు గోపీనాథ్ రెడ్డి విభిన్నమైన ప్రేమ కథతో ముందుకు వచ్చారని ఫస్ట్ గ్లిమ్స్ తోనే అర్థం అవుతోంది. కెమెరామెన్ సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. విప్లవ్ నిషాదం ఎడిటర్ గా.. సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ చిన్న షూటింగ్ షెడ్యూల్ మినహా చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ''సమ్మతమే'' సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.