జోరుమీదున్న కిరణ్ అబ్బవరం.. మైత్రీ బ్యానర్ లో కొత్త సినిమా..!

Mon Nov 29 2021 22:00:01 GMT+0530 (IST)

Kiran Abbavaram New movie under Mythri

'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన యువ నటుడు కిరణ్ అబ్బవరం.. వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ఇటీవలే 'ఎస్ఆర్ కల్యాణమండపం' కమర్షియల్ సక్సెస్ అందుకున్న కిరణ్.. ప్రస్తుతం 'సమ్మతమే' 'సెబాస్టియన్' సినిమాలతో పాటుగా మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ) - గోపీచంద్ మలినేనిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమేష్ కాదూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని - రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్న ఈ సినిమాకి చిరంజీవి (చెర్రీ) - హేమలత పెదమల్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈరోజు సోమవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభించారు. ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ కేఎస్ రవీంద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టారు. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని - రవిశంకర్ - చెర్రీ స్క్రిప్ట్ ను దర్శకుడికి అందజేశారు.

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ మాస్ సినిమాకి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ దర్శకుడు రమేష్ కడూరి అందిస్తున్నారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ గా.. జెవి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. విలక్షణమైన కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్న కిరణ్.. ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో చేస్తుండటం అతని కెరీర్ కు ప్లస్ అనే చెప్పాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.