Begin typing your search above and press return to search.

ఇటలీ వీధుల్లో 'ఖిలాడి' అదిరిపోయే ఛేజింగ్ సీక్వెన్స్..!

By:  Tupaki Desk   |   19 Jun 2021 6:09 AM GMT
ఇటలీ వీధుల్లో ఖిలాడి అదిరిపోయే ఛేజింగ్ సీక్వెన్స్..!
X
క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ.. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ''ఖిలాడి'' చిత్రానికి వర్క్ చేస్తున్నారు. 'రాక్షసుడు' ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకోవడమే కాకుండా.. ఇదొక హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే విషయాన్ని స్పష్టం చేసాయి.

సౌత్ ఇండ‌స్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మరియు అన్బు-అరివు మాస్ట‌ర్స్ 'ఖిలాడి' చిత్రానికి యాక్ష‌న్‌ కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. చిత్ర యూనిట్ కరోనా సెకండ్ వేవ్ ప్రభావానికి ముందు ఇటలీలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేసి తిరిగొచ్చారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎలివేటెడ్ లొకేషన్స్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ని ట్రెయిన్డ్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో చిత్రీకరించారని తెలుస్తోంది.

తాజాగా 'ఖిలాడి' ఇటలీ షెడ్యూల్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్ కు సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు. రవితేజ పాల్గొన్న ఈ బైక్ ఛేజింగ్ సీక్వెన్స్ క్లిప్ చూస్తే, ఇందులో హాలీవుడ్ స్థాయి యాక్షన్ ని చూడబోతున్నామని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా, 'ఖిలాడి' చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌధ‌రి - డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. అనసూయ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. సుజిత్ వాసుదేవ్‌ మరియు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ జయంతీలాల్‌ గడ సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.