'ఖిలాడి' భామతో బాలయ్య ఆట పాట?!

Tue May 17 2022 10:00:47 GMT+0530 (IST)

Khiladi Actress Going to Dance With Balakrishna

'అఖండ'తో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం 'క్రాక్'తో సూపర్ పాపులర్ అయిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్యకు 107వ చిత్రం కావడంతో 'ఎన్‌బీకే 107' వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రను పోషిస్తున్నారు.అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ ముఖ్య పాత్రను చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకి 'అన్నగారు' అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అదిరిపోయే ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉందట. సినిమాకే హైలెట్ గా నిలిచే ఆ స్పెషల్ సాంగ్ కోసం డైరెక్టర్ గోపీచంద్ మలినేని డింపుల్ హయతిని సంప్రదించారట.

ఇటీవల ఈ భామ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన 'ఖిలాడి' సినిమాలో హీరోయిన్ గా నటించి వేరె లెవల్ లో అందాలు ఆరబోసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో డింపుల్ హయతికి అవకాశాలే కరువయ్యాయి. ఈ నేపథ్యంలోనే 'ఎన్‌బీకే 107'లో స్పెషల్ సాంగ్ చేసేందుకు వెంటనే ఆమె ఓకే చెప్పిందట. దీంతో ఖిలాడి భామతో బాలయ్య ఆట పాట మొదలెట్టేశారట.

ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో బాలయ్య డింపుల్ హయతిలపై ఆ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. కాగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

అలాగే ఇందులో సెకెండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ని ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇకపోతే ఈ సినిమా పూర్తైన తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.