ట్రైలర్ టాక్ : లక్ష్యం కోసం ఖైది సాహసం

Mon Oct 14 2019 11:56:46 GMT+0530 (IST)

గత కొంత కాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న కార్తి కొత్త సినిమాతో దీపావళికి పలకరించబోతున్నాడు. మెగాస్టార్ తో పాటు ఫ్యాన్స్ కు సైతం ఎమోషనల్ కనెక్షన్ ఉన్న ఖైది టైటిల్ తో వస్తున్నాడు. దీని ట్రైలర్ ఇందాక విడుదల చేశారు. కథ విషయానికి వస్తే వందల కోట్ల విలువైన మాదకద్రవ్యాల సరుకును కొందరు రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకుంటారు. కాని అనూహ్యంగా దాన్నో దొంగల ముఠా కాజేస్తుంది. ఎక్కడికి వెళ్ళారో అంతు చిక్కదు.కరుడు గట్టిన ఆ నేరస్తులను పట్టుకోవడం కోసం జైల్లో యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ(కార్తి) సహాయం తీసుకుంటారు పోలీసులు. ఇతను ఆ ముఠా సరుకు ఎత్తుకెళ్ళిన లారీ వెనుక పడతాడు. కాని ప్రయాణం చాలా ప్రమాదకరంగా మారుతుంది. హాస్టల్ లో ఉన్న తన కూతురి కోసం ఇదంతా చేస్తున్న ఢిల్లీ చివరికి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేదే ఇందులో కీలకమైన పాయింట్ గా కనిపిస్తోంది

ట్రైలర్ మొత్తం ఇంటెన్సిటీతో నిండిపోయింది. కమర్షియల్ అంశాలకు ఎక్కువ చోటివ్వకుండా పక్కా యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా రూపొందిన ఖైది ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. విజువల్స్ తో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లో ప్రత్యేకతను నిలబెట్టుకుంది. సత్యన్ సూరన్ ఛాయాగ్రహణం సామ్ సంగీతం పోటీ పడ్డాయి. హీరొయిన్ లేని ఈ సినిమాలో కార్తి తనదైన రఫ్ మాస్ లుక్స్ తో  అదరగొట్టాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఖాకీని మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ తో కార్తి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.