Begin typing your search above and press return to search.

ఫరూక్ అబ్దుల్లాతో కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి ఫైట్

By:  Tupaki Desk   |   18 May 2022 6:34 AM GMT
ఫరూక్ అబ్దుల్లాతో కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి ఫైట్
X
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సైలెంట్ గా విడుదలై వైలెంట్ గా సక్సెస్ అయిన మూవీ 'కశ్మీర్ ఫైల్స్'. కేంద్రంలోని బీజేపీ దీన్ని ఓన్ చేసుకొని ప్రచారం చేయడంతో దేశవ్యాప్తంగా హైప్ వచ్చింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో హిట్అయ్యింది. 80, 90వ దశకంలో కశ్మీర్ లో హిందూ పండిట్ల మీద ఇస్లాం ఛాందసవాదులు జరిపిన హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజాన్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రం పెద్దగా అంచనాల్లేకుండానే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

బాక్సాఫీస్ సక్సెస్ పక్కనపెడితే ఈ సినిమాపై ఓ వర్గం వారు తీవ్ర విమర్శలు చేశారు. ఇక మరో వర్గం వారు నెత్తిన పెట్టుకున్నారు. చరిత్రకెక్కని దారుణాలను, పాలకుల తప్పులను చాలా బాగా చూపించారంటూ ఓ వర్గం వారు ప్రశంసలు కురిపిస్తే.. ఇలాంటి సినిమాలు ప్రశాంతంగా బతుకుతున్న ప్రజల మధ్యవిద్వేషాలను రెచ్చగొట్టడానికి కారణమవుతున్నాయని మరో వర్గం వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా సినిమా రిలీజైన్ కొన్ని నెలల తర్వాత జరిగిన పరిణామాలకు ఈ సినిమాకు ముడిపెడుతూ జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్ధుల్లా తాజాగా కశ్మీర్ ఫైల్స్ పై విమర్శలు గుప్పించారు. కశ్మీర్ లోయలోని బుద్గాంలో రాహుల్ భట్ అనే ప్రభుత్వ ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపడంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దీనిపై ఫరుక్ అబ్దుల్లా మాట్లాడారు.

ఇలాంటి ఘటనలకు 'కశ్మీర్ ఫైల్స్' లాంటి సినిమాలే కారణమని.. ఈ సినిమా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని.. దీనిపై తాను లెఫ్టి నెంట్ గవర్నర్ తో మాట్లాడానని.. ఇలాంటి సినిమాలను ఆపాలని కోరానని తెలిపారు.

అయితే తన సినిమాను కశ్మీర్ మాజీ సీఎం తప్పుపట్టడంపై కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యంగా స్పందించారు. 'కశ్మీర్ ఫైల్స్ లేకపోతే హిందువులపై హింసాకాండ జరిగేదే కాదు. మా సినిమా ద్వారానే కశ్మీర్ ప్రజలు మారు, వెళ్లిపో, చచ్చిపో అనే పదాలు నేర్చుకున్నారు.

లేదంటే అమాయక ప్రజలకు ఏం మాట్లాడాలో కూడా తెలిసేది కాదు.. అక్కడ పాకిస్తాన్ జెండా కూడా ఎగిరేది కాదు అంటూ సినిమాలో చూపించిన విషయాలకు ముడిపెడుతూ ఫరూక్ పై వివేక్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలా ప్రత్యర్థుల ఆరోపణలకు కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు తగ్గేదేలే అన్నట్టుగా సమాధానాలు ఇస్తూ కాకరేపుతున్నారు.