‘విశ్వరూపం-2’కు ఉన్న కష్టాలు చాలవని..

Wed Aug 08 2018 14:06:24 GMT+0530 (IST)

Karunanidhi Death issue Effect on Kamal Haasan Vishwaroopam 2

ఒక సినిమా పూర్తయ్యాక విడుదల విషయంలో జాప్యం జరిగిందంటే దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది. అది కూడా కొన్ని నెలలైతే పర్వాలేదు కానీ.. ఏళ్లకు ఏళ్లు సినిమా వాయిదా పడిందంటే ఇక అంతే సంగతులు. ఇలాంటి సినిమాలు ఆడిన దాఖలాలు చాలా తక్కువ. ఇదొక నెగెటివ్ సెంటిమెంటుగా మారిపోయింది. ఈ సెంటిమెంటు ‘విశ్వరూపం-2’ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. ‘విశ్వరూపం’ స్టయిల్లోనే కనిపిస్తున్న ఈ చిత్రంపై కమల్ ధీమాగా ఉన్నప్పటికీ.. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ప్రేక్షకుల్లో దీనిపై ఏమాత్రం ఆసక్తి నిలిచి ఉంటుందా అన్న సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి. దీనికి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడం.. బజ్ కూడా కొంచెం తక్కువగానే ఉండటం కలవరపెడుతోంది. మరోవైపు ఫైనాన్స్ సమస్య సైతం దాన్ని వెంటాడుతోంది. ఒక సంస్థ ఈ సినిమా విడుదల ఆపాలంటూ కోర్టుకు కూడా వెళ్లడం తెలిసిందే.ఈ తలనొప్పులు చాలవని ఇప్పుడు ఓ పరిణామం ‘విశ్వరూపం-2’కు ప్రతికూలంగా మారింది. మంగళవారం రాత్రి కరుణానిధి చనిపోవడంతో ఇప్పుడు తమిళనాడు అంతటా విషాదం నెలకొంది. అందరి చర్చలూ కరుణ మీదికి వెళ్లిపోయాయి. సినిమాల గురించి అసలెవరూ ఆలోచించే పరిస్థితి లేదు. కమల్ హాసన్ ప్రమోషన్లు ఆపేయాల్సి వచ్చింది. శుక్రవారం సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ముందు రెండు రోజులూ పత్రికలు.. టీవీలు..  వెబ్ సైట్లు. సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా కరుణే చర్చనీయాంశం అవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ‘విశ్వరూపం-2’ గురించి ఎవరు పట్టించుకుంటారన్నది సందేహం. సినిమా రిలీజ్ రోజు కూడా దీని చర్చ పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కరుణ మరణం తాలూకు విషాదం కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది కాబట్టి... మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో సినిమా చర్చలు పెట్టడానికి చాలామంది సందేహిస్తారు. ఈ పరిస్థితుల్లో ‘విశ్వరూపం-2’ ఎలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందో చూడాలి.