అల్లువారి పై పంచ్ వేసిన ఆరెక్స్ హీరో!

Thu Jul 18 2019 22:23:54 GMT+0530 (IST)

Kartikeya gets a chance in Geetha Arts

గతంలో సినిమా ఈవెంట్లంటే పొగడ్తలతో చంపడమే పనిగా పెట్టుకునేవారు. దీంతో ప్రేక్షకులకు ఒక దశలో ఆ ఈవెంట్ చూడడానికి చిరాకొచ్చేది.  ఇప్పుడు కూడా పొగడ్తల బ్యాచ్ ఏమీ తగ్గలేదు కానీ కొత్త జెనరేషన్ హీరోలు మాత్రం తమ ఫిల్మీ ఈవెంట్లను ఆకర్షణీయంగా.. వీలైనంత స్పైసీగా మారుస్తున్నారు.  అందుకే  సినిమా ఈవెంట్లు గతంలోలా చప్పగా సాగడం లేదు.  విజయ్ దేవరకొండ తో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ను విశ్వక్ సేన్ పీక్స్ కు తీసుకెళ్ళి రచ్చ చేసిపారేశాడు. ఇక  'RX100' కార్తికేయ కూడా ఈ ట్రెండ్ లో సాగుతున్న హీరోనే.కార్తికేయ తన లాస్ట్ సినిమా 'హిప్పీ' ఈవెంట్లో షర్టు ను విప్పి గిరగిరా తిప్పుతూ గిరాటేసిన సంగతి తెలిసిందే.  సల్మాన్ భాయిజాన్ లాంటివారిని చూసి చూసి బాలీవుడ్ జనాలకు అలాంటివి అలవాటైపోయాయేమో కానీ మన తెలుగు ప్రేక్షకులకు కొత్తే.  సరేలే.. 'హిప్పీ' షర్టు ఎపిసోడ్ ఒక్కటే కదా అనుకుంటే రీసెంట్ గా కార్తికేయ ఏకంగా సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిపై పంచ్ వేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.  

కార్తికేయ కొత్త సినిమా 'గుణ 369' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్.. బోయపాటి శ్రీను హాజరయ్యారు.  బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల 'గుణ 369' చిత్రానికి దర్శకుడు.  'సరైనోడు' కు అర్జున్ జంధ్యాల దర్శకత్వ శాఖలో పనిచేశాడట.  కార్తికేయ ఈ విషయం ప్రస్తావిస్తూ 'సరైనోడు' కంటే 'గుణ 369' పెద్ద విజయం సాధిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు.  ఏదో పంచ్ బాగుందని అన్నానని తర్వాత కవర్ చేశాడు.  

అల్లు అరవింద్ గారు తన స్పీచ్ లో బోయపాటి త్వరలో గీతా ఆర్ట్స్ లో ఒక సినిమాకు పనిచేస్తారని వెల్లడించారు. ఈ సమయంలో కార్తికేయ అందుకుంటూ "అందులో హీరో నేనేనా సార్?"అంటూ పంచ్ విసిరాడు.  కానీ ఈ విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకున్న అరవింద్ గారు "వెల్కమ్ టు గీతా ఆర్ట్స్" అంటూ బదులిచ్చారు.   అయితే వెటరన్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ పై ఇలా కార్తికేయ పంచ్ వేయడంపై ఇండస్ట్రీవారు ముక్కున వేలేసుకుంటున్నారు.  పెద్ద స్టార్ హీరోలు సైతం అరవింద్ గారితో ఆచితూచి మాట్లాడతారని.. కానీ కార్తికేయ ఇలా మాట్లాడడం సరిగా లేదని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.