రియల్ వదినా మరిది.. రీల్ అక్కా తమ్ముడు

Mon Apr 15 2019 13:24:09 GMT+0530 (IST)

Karthi plays Jyothika brother in Jeethu Joseph film

ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న జ్యోతిక హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే హీరో సూర్యను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు జ్యోతిక బ్రేక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత పిల్లలు వారి పెంపకం కోసం చాలా ఏళ్లు సినిమాలకు దూరంగా ఉంది. పిల్లలు పెద్ద వారు అయిన నేపథ్యంలో జ్యోతిక మళ్లీ భర్త సహకారంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీతో జ్యోతిక మళ్లీ మంచి గుర్తింపు దక్కించుకుని సక్సెస్ లు అందుకుంది. తాజాగా సూర్య తమ్ముడు కార్తీ నటించబోతున్న ఒక చిత్రంలో జ్యోతిక నటించబోతుందనే వార్త ఇప్పటికే వచ్చిన విషయం తెల్సిందే. అయితే తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఒక వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.కార్తీ మరియు జ్యోతికలు వదినా మరిది అవుతారు అలాంటి వీరిద్దరు సినిమా కోసం అక్కా తమ్ముడిగా మారబోతున్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం రూపొందబోతుంది. ఆ చిత్రంలో కీలక పాత్రను జ్యోతిక చేస్తోంది. హీరోగా నటించబోతున్న కార్తీ పాత్రకు అక్క పాత్ర కథలో చాలా కీలకం. అందుకే కార్తీకి అక్క పాత్రకు గాను జ్యోతిక అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. పాత్ర నచ్చడంతో జ్యోతిక కూడా వెంటనే ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతుంది. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ సభ్యులు వెళ్లడించే అవకాశం ఉంది.