వివాహ అశాంతికి కారణం అతడేనన్న సామ్

Sun Jul 03 2022 10:46:24 GMT+0530 (IST)

Karan Johar Is The Reason For Unhappy Marriages

పెద్ద తెర క్రియేటర్లు తెరపై ఎంతో అందంగా ప్రేమ పెళ్లిళ్లను కుటుంబ అనుబంధాలను చూపిస్తుంటారు. వాటిని చూసి ఎంతో మురిసిపోతుంటాం. ఇలాంటి ఆవిష్కరణల్లో ప్రతిభావంతుడైన దర్శకుడు కరణ్ జోహార్. అతడు తెరకెక్కించిన `కభీ ఖుషీ కభీ ఘమ్` ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ప్రేమలు కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హిందీ అగ్ర తారాగణం జీవించారు. వాస్తవంలో అలా ఉందా? అంటే ససేమిరా అనాల్సిన పరిస్థితి నేటి సమాజంలో ఉంది. పెద్దిళ్లలో ఆస్తుల తగాదాలు.. మనస్ఫర్థలు అన్నీ ఇన్నీ కావు. భార్యాభర్తల కలతల్లో నిరంతరం ఏదో ఒక వార్త సంచలనం అవుతూనే ఉంది. ఇంతకుముందు అక్కినేని నాగచైతన్య -సమంత జంట నడుమ అన్యోన్యత గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్న ప్రపంచం ఆ తర్వాత బ్రేకప్ అని ప్రకటించగానే షాక్ తింది.ఇప్పుడు అదే ప్రశ్న మళ్లీ కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ (సీజన్ 7) షోలో ఎదురైంది. కరణ్ దాపరికం లేకుండా జవాబు చెప్పాలంటూ సమంతను తన బ్రేకప్ గురించి ప్రశ్నించాడని హింట్ అందింది. దానికి సమంత ఏం సమాధానం చెబుతుందోనన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. అయితే తాజాగా విడుదల చేసిన కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ట్రైలర్ లో మాత్రం దానిని గుంబనగా దాచి ఉంచారు. ఈ సీజన్ కి సమంత ఎపిసోడ్  ప్రధాన హైలైట్ గా ట్రైలర్ ఆవిష్కరించింది.  తాజా సీజన్ జూలై 7 నుండి హాట్ స్టార్ లో ప్రసారం ప్రారంభమవుతుంది. ఈసారి సీజన్ లో తెలుగు హీరో విజయ్ దేవరకొండ కూడా అతిథి. ప్రభాస్- రానా తర్వాత దేవరకొండకు ఈ అవకాశం దక్కింది.

తాజా ట్రైలర్ లో కరణ్ ప్రశ్నలకు సమంత ఫన్నీ సెటైరికల్ సమాధానం ఒకటి హైలైట్ గా నిలిచింది. పెళ్లిపై సమంత ఇచ్చిన క్రియేటివ్ ఆన్సర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ``వివాహాలు సంతోషంగా ఉండడానికి కారణం మీరే!``నని కరణ్ ని సూచించిన సమంత.. ``మీరు జీవితాన్ని K3Gగా చిత్రించారు (కభీ ఖుషి కభీ ఘమ్ - కరణ్ చిత్రం). నిజానికి రియాలిటీ కేజీఎఫ్``' అంటూ తనదైన శైలిలో సమంత పంచ్ వేసారు.

ఇది కేవలం సమంత- చైతన్య పెళ్లి గురించే కాదు.. చాలా పెళ్లిళ్ల గురించి పంచ్ అని కూడా స్పష్టంగా అర్థమవుతోంది. చూడటానికి కభీ ఖుషీ కభీ ఘమ్ అంత అందంగా కనిపిస్తాయి పెళ్లిళ్లు. కానీ వాస్తవంలో కేజీఎఫ్ గనుల్లో లాగా మరుగుతూ ఉంటాయి. పెద్దిళ్లలో   ప్రేమలు ప్రతీకార జ్వాలలతో భగభగ మండుతున్నాయి! అనే అర్థం అందులో ధ్వనించింది. ఇంతకీ ఈ షోలో సమంత తన హబ్బీ నాగచైతన్య నుంచి ఎందుకు విడిపోయిందో చెబుతుందా లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ వరకూ దాచేసినా టోటల్ షోలో సమంత ఏదో ఒక విషయాన్ని నిర్థారిస్తుందని భావిస్తున్నారు. ఈ షోలో ఖిలాడీ అక్షయ్ కుమార్ తో కలిసి సమంత కనిపించనుంది.