'సలార్' దర్శకుడి వివరణతో కన్నడిగులు సైలెంట్ అవుతారా..?

Sat Dec 05 2020 11:00:01 GMT+0530 (IST)

Kannadigas Trolls On Prabhas Prashant Neel Movie

ఉగ్రమ్' అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్.. రెండో సినిమా 'కేజీఎఫ్' తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా మాస్ ప్రేక్షకుల పల్స్ తెలుసుకున్న దర్శకుడు అనిపించుకున్నాడు. అందుకే ప్రతి స్టార్ హీరో కూడా ఈ సంచలన దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోలు - నిర్మాతలు ప్రశాంత్ తో సినిమా చేయడానికి ముందుగానే ఖర్చీఫ్ వేశారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా పనులతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ - ప్రభాస్ లతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.అయితే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేయడం పట్ల టాలీవుడ్ సినీ అభిమానులు హ్యాపీగా ఉన్నప్పటికీ.. శాండిల్ వుడ్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కన్నడిగులు సోషల్ మీడియా వేదికగా ఆయన పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తనకు లైఫ్ ఇచ్చిన కన్నడ చిత్రసీమను నిర్లక్ష్యం చేసి ఇతర ఇండస్ట్రీల హీరోల కోసం పరుగులు పెడుతున్నాడంటూ ప్రశాంత్ మీద కన్నడిగులు తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ నెగిటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు. ఇంతకముందు పొగిడిన వాళ్ల నుంచే వ్యతిరేకత రావడం చూసిన చూశాక ప్రశాంత్.. తాను ప్రభాస్ తోనే ఎందుకు సినిమా చేస్తున్నాడో వివరణ ఇచ్చుకున్నాడు.

ప్రశాంత్ నీల్ ఓ ఆంగ్ల డైలీతో మాట్లాడుతూ..''నేను దర్శకుడిగా పేరు తెచ్చుకున్నది కన్నడ సినిమాలతోనే. 'ఉగ్రమ్' 'కేజీఎఫ్' సినిమాలతో నాకు పేరొచ్చింది. ఇక్కడ ఉన్న హీరోలను కాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్ ని హీరోగా తీసుకోవడం గురించి చాలామంది అడుగుతున్నారు. నేను రాసుకున్న ‘సలార్’ కథకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నా. మిగతా విషయాలు సినిమా విడుదలయ్యాక మాట్లాడతాను'' అని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో కన్నడ హీరోలతో సినిమా చేయలేదని కామెంట్స్ చేసిన శాండిల్ వుడ్ ఫ్యాన్స్ ప్రశాంత్ వివరణతో సైలెంటుగా ఉంటారేమో చూడాలి.