అమ్మ బయోపిక్ కి ఆదిలోనే అగచాట్లు

Thu Sep 12 2019 21:45:31 GMT+0530 (IST)

Kangana Ranaut Movie Thalaivi Shelved

ఆలు లేదు.. చూలు లేదు కానీ కొడుకు పేరు సోమలింగం! అన్నాడట వెనకటికి ఒకడు. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వ్యవహారం చూస్తుంటే అలానే ఉంది మరి. అసలు దేనికదే లేదు. ఈలోగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పై టీవీ సిరీస్ చేస్తున్నానంటూ హడావుడి స్టార్ట్ చేసేశాడు. ఇదివరకూ సోషల్ మీడియాల్లో ప్రీలుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసేశాడు. జయలలిత పాత్రలో ఎవరో గెస్ చేయండి అంటూ ఫజిల్ కూడా వేసాడు. గౌతమ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అమ్మ జయలలిత పాత్రలో శివగామి రమ్యకృష్ణ నటిస్తోంది అని తెలియగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఆ పాత్రకు సరైన నటిని ఎంపిక చేసుకున్నాడని గౌతమ్ పైనా పొగడ్తలు కురిపించారు. వెబ్ సిరీస్ కాబట్టి సులువుగా మొబైల్ వీక్షణకు అందుబాటులో ఉంటుందన్న ఆనందం ఇటు తెలుగు అభిమానుల్లోనూ కనిపించింది.ఇంతవరకూ బాగానే ఉంది కానీ... ఇదిగో ఈ నిరసనల గళమే అస్సలు బాలేదు. ఇంకా వెబ్ సిరీస్ చిత్రీకరణ మొదలెట్టకముందే ఆదిలోనే హంస పాదులాగా.. జయలలిత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమర్ తాజాగా లైన్ లోకి వచ్చి తమిళ మీడియాకి ఓ ప్రెస్ నోట్ పంపించాడు. ``ఇంతవరకూ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ తప్ప వేరే ఎవరూ మమ్మల్ని ఈ బయోపిక్ విషయమై సంప్రదించలేదని తెలిపారు. ఒకవేళ జయలలితపై సినిమా కానీ.. వెబ్ సిరీస్ కానీ చేసేట్టయితే మమ్మల్ని సంప్రదించాల్సిందే. లేదంటే మేం వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం`` అని ఈ నోట్ లో తీవ్రంగా హెచ్చరించారు. దీంతో గౌతమ్ మీనన్ తెరకెక్కించే టీవీ సిరీస్ కి ఆదిలోనే అడ్డంకి ఎదురైంది.

జయలలితపై ఒకేసారి మూడు బయోపిక్ లు తీస్తున్నారు. అందులో రెండు పెద్ద తెర కోసం. ఇంకొకటి బుల్లితెర- స్మార్ట్ టీవీ కోసం. పెద్ద తెరపై నిత్యామీనన్ .. కంగన రనౌత్ వేర్వేరు సినిమాల్లో అమ్మ జయలలిత పాత్రలో కనిపించనున్నారు. కంగన కథానాయికగా తెరకెక్కనున్న బయోపిక్ వరకూ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఏ.ఎల్.విజయ్ అనుమతి తీసుకున్నారట. ఈ చిత్రాన్ని `ఎన్టీఆర్` బయోపిక్ ఫేం.. తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీని వరకూ ఇబ్బంది లేదు కానీ నిత్యా టైటిల్ పాత్రలో నటించే బయోపిక్ విషయంలో కానీ.. గౌతమ్ మీనన్ తెరకెక్కించే వెబ్ సిరీస్  గురించి కానీ అనుమతులు లేవన్నది జయలలిత కుటుంబీకుల ఆరోపణ. ఇవి తీసే ముందే తమని సంప్రదించాలన్న వాదనను తెరపైకి తెచ్చారు కాబట్టి చట్టపరంగా బ్యాటిల్ చేయాల్సి ఉంటుందనే సందేహాలొస్తున్నాయి.

అసలింతకీ జీవితకథలు తీసే వారిపై చట్ట పరమైన చర్యలు ఎలా ఉంటాయి? అధిగమించడమెలా? అని ఆరాతీస్తే.. చాలా సంగతులే తెలిశాయి. ఎవరైనా ఓ పబ్లిక్ పర్సనాలిటీకి సంబంధించి బయోపిక్ తీయాలనుకుంటే కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే తీయొచ్చు. కానీ జీవించి ఉన్న వ్యక్తిపై మాత్రం నెగెటివ్ గా చూపించకూడదు. ఒకవేళ సాక్ష్యం ఉంది అంటే దానిని కోర్టులకు సమర్పించి ఆ ఫ్యాక్ట్ ను కూడా యథాతథంగా తెరపై చూపించవచ్చు. ఇంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ తీసిన ఆర్జీవీ ఇలానే చేశారు. అందుకే తనపై ఎన్ని కేసులు వేసినా అవేమీ చేయలేకపోయాయి. అన్నిటి నుంచి ఆయన బయటపడి `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` అంటూ కొత్త హడావుడి మొదలెట్టారు. ఇప్పుడు గౌతమ్ మీనన్ ధీమా కూడా అదే కావొచ్చు. లేదూ ఇంకా ఆరంభ దశలోనే ఉన్నారు కాబట్టి `మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్!` అనకుండా అనుమతులు తీసుకుంటారేమో చూడాలి.