Begin typing your search above and press return to search.

అయ్యో కంగ‌న ఎంత ప‌ని జ‌రిగింది? వీళ్లింతే!

By:  Tupaki Desk   |   19 Jun 2021 2:30 AM GMT
అయ్యో కంగ‌న ఎంత ప‌ని జ‌రిగింది? వీళ్లింతే!
X
మైక్ దొరికింద‌ని రెచ్చిపోకూడ‌దు. నోటికి ప‌ని చెప్ప‌కూడ‌దు. ఒక‌వేళ ప‌బ్లిగ్గా నోటి దురుసు ప్ర‌ద‌ర్శిస్తే ఆ త‌ర్వాత ప‌ర్య‌వ‌సానం అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇష్టానుసారం రాజ‌కీయ నాయ‌కుల‌పై మాట విసిరేస్తే ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో క్వీన్ కంగ‌న‌కు క్లారిటీగా అవ‌గ‌తమైంది. ఇప్పుడు ఇది కెరీర్ కే శ‌రాఘాతంగా మారేలా ఉంద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

అస‌లింత‌కీ ఏం జ‌రిగింది? అంటే.. కంగ‌న గ‌డువు ముగిసిన త‌న పాస్ పోర్ట్ ని రెన్యువ‌ల్ చేయించుకునేందుకు పాస్ పోర్ట్ ఆఫీస్ కి వెళితే అందుకు అధికారులు అడ్డు చెప్పారు. త‌న‌పై ఉన్న ఎఫ్‌.ఐ.ఆర్ క్లియ‌రైతే కానీ ఏదీ చేయ‌లేమ‌ని తేల్చి చెప్పారు. దీంతో కోర్టుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. అయితే కోర్టులో మ్యాట‌ర్ అంటే తొంద‌ర‌గా తేల్తుందా? జూన్ 25 నాటికి వాయిదా వేసారు జ‌డ్జిలు. అలో ల‌క్ష్మ‌ణా! అంటూ ఇప్పుడు కంగ‌న త‌దుప‌రి ధాక‌డ్ షెడ్యూల్ కి ఎలా వెళ్లాలో తెలీని క‌న్ఫ్యూజ‌న్ లో ఉంది.

ఇదంతా ఎందువ‌ల్ల అంటే గ‌త త‌ప్పిదాల ఫ‌లిత‌మిది. నాయ‌కుల‌పై ఎడా పెడా చెల‌రేగిన కంగ‌న‌కు ఇప్పుడు తెలిసొస్తోంది. త‌న‌పై ప‌గ‌బ‌ట్టిన రాజ‌కీయ నాయ‌కులు త‌న‌కు ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. కేసులు ఎఫ్.ఐ.ఆర్ లు అంటూ నానా తిప్ప‌లు పెడుతున్నారు. ఈ సీన్ చూశాక‌.. అయ్యో కంగ‌నా ఈ పాడు నాయ‌కులు ఇంతే.. దీని నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే క‌చ్ఛితంగా కంగ‌న‌యే జ‌య‌ల‌లిత‌లా రాజ‌కీయాల్లోకి రావాల్సి ఉంటుందేమో!! అంటూ కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

కంగనా రనౌత్ ఈ రోజు తన ఇన్ స్టా లో పాస్‌పోర్ట్ పునరుద్ధరణ గురించి ప్ర‌స్థావిస్తూ .. తాను మునిగిపోతున్నాన‌ని వ్యాఖ్యానించ‌డ‌మే గాక‌.. తన చుట్టూ ఉన్న మాయాజాలంపైనా క‌వితాత్మ‌కంగా స్పందించింది. అందరూ నిరాశ అనే ఉచ్చులో పడతారు. నిన్న నాకు మునిగిపోతున్న అనుభూతి కలిగింది.. నేను చావు చివ‌రి అంచులో చిక్కుకున్నట్లు అనిపించింది. ఆత్రుతగా ఆందోళనగా అనిపించింది. కాని నా చుట్టూ ఉన్న మాయాజాలం చూడండి. నా నొప్పి నిజమైన‌ది. అక్కడ ఉన్న ప్రేమ అంతా అకస్మాత్తుగా అదృశ్యమైనట్లు అనిపిస్తోంది. ఈ ఉదయం ఒక ఫ్లాష్ లో నన్ను విడిచిపెట్టినదానితో నేను అబ్బురపడ్డాను.. నమ్మండి`` అంటూ చాలా ఆవేద‌న‌తో కూడుకున్న స్వ‌రంతో కంగ‌న క‌విత్వం చెప్పింది.

సెప్టెంబర్ 15 తో గడువు ముగియడంతో తన పాస్ పోర్ట్ పునరుద్ధరించడానికి అనుమతి కోరుతూ కంగ‌న‌ బొంబాయి హైకోర్టుకు వెళ్లారు. ధాక‌డ్ షూట్ కోసం తాను విదేశాల‌కు ప్రయాణించవలసి ఉంది. కానీ మేజిస్ట్రేట్ ఉత్తర్వు ప్ర‌కారం.. హెచ్ ఐ సి ముందు సవాలులో ఉన్న ఎఫ్.ఐ.ఆర్ కేసు తొల‌గాకే సాధ్య‌మ‌ని తెలిసింది. ఈ పిటిషన్ విచారణ జూన్ 25 వరకు వాయిదా పడింది. అది తేలే వ‌ర‌కూ పాస్ పోర్ట్ రెన్యువ‌ల్ కావ‌డం క‌ష్టం. ఇక‌ ధాక‌డ్ తో పాటు కంగ‌న తేజ‌స్.. మ‌ణిక‌ర్ణిక రిట‌ర్న్స్ -త‌లైవి చిత్రాల్లో న‌టిస్తోంది.