బెల్లంకొండ బ్రదర్ చిత్రానికి కమల్ హాసన్ క్లాసిక్ టైటిల్..!

Tue Sep 14 2021 12:30:46 GMT+0530 (IST)

Kamal Haasan classic title for Bellamkonda Brother

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు యువ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గణేష్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. వాటిలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా కూడా ఉంది. ఈరోజు బెల్లంకొండ గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ లాంచ్ చేసారు.బెల్లంకొండ గణేష్ చిత్రాననికి ''స్వాతిముత్యం'' అనే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ టైటిల్ వినగానే కమల్ హసన్ - డైరెక్టర్ విశ్వనాథ్ కలయికలో వచ్చిన అద్భుతమైన చిత్రం 'స్వాతిముత్యం' గుర్తు రాక మానదు. ఇది భారతీయ చలన చిత్రసీమలో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు అదే టైటిల్ ను బెల్లంకొండ బ్రదర్ సినిమాకి పెట్టారు. కాకపోతే ఆ స్వాతి ముత్యానికీ.. ఈ స్వాతి ముత్యానికీ కథలో సంబంధం లేదు. కాకపోతే హీరో క్యారెక్టరైజేషన్ మాత్రమే స్వాతిముత్యం లాంటిదని తెలుస్తోంది.

''స్వాతిముత్యం'' ఫస్ట్ లుక్ లో ఓ ఎంప్లాయి గెటప్ లో ఉన్న గణేష్.. భుజాన బ్యాగ్ తగిలించుకుని ఫార్మల్స్ లో కూల్ గా కనిపిస్తున్నాడు. టైటిల్ ని బట్టి గణేష్ నిజాయితీపరుడైన అమాయకపు యువకుడిగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు బెల్లంకొండ ఫస్ట్ లుక్ లో కూడా అదే కనిపిస్తోంది. ఈ చిత్రంలో 'జాను' ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.

లక్ష్మణ్ కె కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సూర్య సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న 'స్వాతి ముత్యం' చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.