కమల్ సెంటిమెంటు మారుస్తాడా?

Fri Aug 10 2018 11:26:43 GMT+0530 (IST)

ఒక సినిమా ఏళ్లకు ఏళ్లు వాయిదా పడి.. ఆలస్యంగా విడులైందంటే అది సరిగా ఆడదని సినీ పరిశ్రమలో ఒక ముద్ర పడిపోయింది. ఇది బలమైన సెంటిమెంటుగా మారడానికి చాలా రుజువులే కనిపిస్తాయి. మరి ఈ సెంటిమెంటను కమల్ హాసన్ బ్రేక్ చేస్తాడా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వరూపం-2’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రం ఐదున్నరేళ్ల కిందట వచ్చిన ‘విశ్వరూపం’ చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. తొలి భాగం తీసేటపుడే సగం దాకా చిత్రీకరణ జరిపి.. రెండో భాగాన్ని కూడా చకచకా పూర్తి చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో వచ్చిన చిక్కులతో ఈ చిత్రం మరుగున పడిపోయింది.ఐతే ఎట్టకేలకు గత ఏడాది కమల్ ఈ చిత్రాన్ని తనే టేకప్ చేసి అన్ని పనులూ పూర్తి చేశాడు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘విశ్వరూపం’ అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. కమల్ స్వీయ దర్వకత్వం అంటే జనాలు భయపడే పరిస్థితుల్లో ఈ చిత్రం మాత్రం భిన్నమైన ఫలితాన్నందుకుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒక హాలీవుడ్ సినిమా చూసిన భావన కలిగించింది. కమర్షియల్ గానూ పెద్ద విజయాన్నందుకుంది. ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ వస్తున్నప్పటికీ ‘విశ్వరూపం’ నచ్చిన వాళ్లలో ఆసక్తి ఏమీ తగ్గలేదు. దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగానే కనిపించాయి. విడుదల విషయంలో కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ.. అన్నింటినీ తొలగించుకుని థియేటర్లలోకి దిగేస్తోందీ చిత్రం. మరి ఇలా ఆలస్యంగా రిలీజయ్యే సినిమాలు ఆడవన్న సెంటిమెంటును ‘విశ్వరూపం-2’ బ్రేక్ చేసి కమల్ కు.. ఆయన అభిమానులకు ఆనందాన్ని పంచుతుందేమో చూద్దాం.