Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ లో ఫిల్మ్ మేకింగ్ గురించి కమల్ సలహా అడిగిన 'ప్రేమమ్' డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   19 Jun 2021 6:30 AM GMT
ఫేస్ బుక్ లో ఫిల్మ్ మేకింగ్ గురించి కమల్ సలహా అడిగిన ప్రేమమ్ డైరెక్టర్..!
X
విశ్వనటుడు కమల్ హాసన్ ఆరు దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. 'దశావతారం' సినిమాలో పది విలక్షణమైన పాత్రలు పోషించిన కమల్.. తనలోని నటనాభినయాన్ని ప్రేక్షకులకు ప్రత్యక్షంగా చూపించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినీ హిస్టరీలో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఈ ఏడాదితో 'దశావతారం' సినిమా 13 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కమల్ హాసన్ ఓ వీడియోని ఫేస్ బుక్ వేదికగా షేర్ చేశారు.

పది పాత్రల్లో వృద్ధురాలి పాత్ర చాలా కష్టంగా అనిపించిందని.. క్లైమాక్స్ లో సునామీ నేపథ్యంలో వచ్చే సీన్స్ పర్ఫెక్ట్ గా రావడానికి అనుకున్న దానికంటే కోటి రూపాయల పైనే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చిందని.. ఇలా 'దశావతారం' సినిమా గురించి కమల్ హాసన్ చెప్పారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి మలయాళ 'ప్రేమమ్' దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రెన్ స్పందించారు. కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టిన అల్ఫోన్స్.. కమల్ హాసన్ ను సినిమా మేకింగ్ గురించి సలహా అడిగారు.

“కమల్ హాసన్ సార్.. 'మైఖేల్ మదన కామరాజన్' చిత్రాన్ని ఎలా తీసారో మాకు చెప్పగలరా? 'దశావతారం' సినిమా ఫిల్మ్ మేకింగ్ లో పిహెచ్‌డి లాంటిది. మైఖేల్ మదన కామరాజన్ డిగ్రీ కోర్సు లాంటిది సార్” అని అల్ఫోన్స్ పుత్రెన్ కామెంట్ పెట్టారు. దీనికి కమల్ సమాధానమిస్తూ 'మైఖేల్ మదన కామరాజు' అనుభవాలను త్వరలో పంచుకుంటానని చెప్పారు.

“ఇది మీరు నేర్చుకోడానికి ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు. నేను ఇంతకముందు చెప్పినట్లుగా ఇది నా మాస్టర్ క్లాస్. కొన్ని సంవత్సరాల తరువాత దాని గురించి మాట్లాడటం నాకు కొత్త పాఠాలు నేర్పుతుంది'' అని కమల్ అన్నారు. ఇకపోతే కమల్ కు అభిమాని అయిన ఆల్ఫోన్స్.. ఆయన ఎప్పటికైనా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ఆ మధ్య వ్యాఖ్యానించారు.