Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ - రజినీకాంత్ క్రేజీ ప్రాజెక్టు..35 ఏళ్లకు మళ్ళీ ఒక్కటై!

By:  Tupaki Desk   |   27 Feb 2020 3:30 PM GMT
కమల్ హాసన్ - రజినీకాంత్ క్రేజీ ప్రాజెక్టు..35 ఏళ్లకు మళ్ళీ ఒక్కటై!
X
లోకనాయకుడు కమల్ హాసన్ - సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ ఇద్దరి సినిమాలకు ఉన్న డిమాండ్ మరే ఇతర హీరోల సినిమాలకు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. దేశ అశేష అభిమాన వర్గమున్న ఈ హీరోలతో ఇంకే స్టార్ హీరో పోటీకి కూడా రాలేడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి సినిమా విడుదలైనా బాక్సాఫీస్ వద్ద ఆ హాంగామే వేరు. అలాంటిది ఇద్దరూ ఒకే ప్రాజెక్టులో భాగమైతే ఇక ఆ సునామీ ఊహించగలమా? మరి కొద్ది రోజుల్లోనే ఆ అరుదైన ఘట్టం చూడబోతున్నామని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ - రజినీకాంత్ కలిసి ఒకే సినిమా కోసం పని చేయబోతున్నారనేది లేటెస్ట్ సమాచారం. కాకపోతే ఈ సినిమాలో ఆ ఇద్దరు హీరోలు కలసి నటించడం లేదట. కమల్ హాసన్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటే.. రజినీకాంత్ కెమెరా ముందు తన మార్క్ స్టైల్ కొట్టబోతున్నారట. కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్‌పై రజినీకాంత్ హీరోగా కొత్త సినిమా రూపొందించేందుకు అన్నీ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సినిమాను మార్చి 5వ తేదీన అఫీషియల్ గా ప్రకటించనున్నారని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీంతో అటు కమల్ - ఇటు రజినీకాంత్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. గతంలో చాలా ఏళ్ల క్రిందట ఈ ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. చివరగా హిందీలో 1985 లో వచ్చిన గిరఫ్తార్ సినిమాలో నటించిన ఈ లెజెండ్స్.. మళ్ళీ ఇన్నేళ్లకు ఒకే సినిమా కోసం కలిసి పనిచేయనుండటం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.