హలో బ్యూటీ బుట్టలో మరో క్రేజీ ఆఫర్!

Tue Apr 16 2019 07:00:02 GMT+0530 (IST)

Kalyani Priyadarshan Offer in Telugu Film Industry

మలయాళ భామ కళ్యాణి ప్రియదర్శన్ అఖిల్ సినిమా 'హలో' తో  ఇండస్ట్రీకి పరిచయం అయింది.  కానీ ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది.  కానీ 'హలో' ఫలితంతో సంబంధం లేకుండా అప్పుడే రెండు ఆఫర్లు వచ్చాయి.  అందులో ఒకటి 'చిత్రలహరి' కాగా మరొకటి శర్వానంద్ - సుధీర్ వర్మ చిత్రం. శర్వానంద్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ సాయి తేజ్ 'చిత్రలహరి' ఈ శుక్రవారం రిలీజ్ అయి విజయం సాధించింది.  దీంతో కళ్యాణి ఖుషీఖుషీగా ఉందట.మొదటి సినిమా నిరాశపరిచినా రెండో సినిమాతో విజయం సాధించడం ఎవరికైనా సంతోషాన్నిస్తుంది. ఈ సక్సెస్ సంతోషమే కాదు.. కళ్యాణికి మరో ఆఫర్ ను కూడా తీసుకొచ్చిందని సమాచారం.  నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' టైటిల్ తో ఒక సినిమాను ఈమధ్యే అధికారికంగా ప్రకటించారు కదా.  ఈ సినిమాలో రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్.  ఇందులో సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉందట. ఇప్పుడు కళ్యాణి ప్రియదర్శన్ కు ఆ సెకండ్ హీరోయిన్ పాత్రనే ఆఫర్ చేశారట.  పేరుకి సెకండ్ హీరోయిన్ అయినా ఆ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందట.  దీంతో ఎక్కువ ఆలోచించకుండా సినిమాకు సైన్ చేసిందట ఈ హలో బ్యూటీ.

'ఛలో' తో మంచి విజయం సాధించిన దర్శకుడు వెంకీ కుడుములకు ఇది రెండో చిత్రం.  సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.