Begin typing your search above and press return to search.

వీడియో: 'పుష్పక విమానం' నుంచి రమణీయమైన 'కల్యాణం' పాట..!

By:  Tupaki Desk   |   18 Jun 2021 6:22 AM GMT
వీడియో: పుష్పక విమానం నుంచి రమణీయమైన కల్యాణం పాట..!
X
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "పుష్పక విమానం". నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఆనంద్ సరసన గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు - 'సిలకా' లిరికల్ సాంగ్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'కళ్యాణం' అనే మరో లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

''అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో.. సందళ్లు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో.. మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో..'' అంటూ కళ్యాణం పాట ప్రారంభమైంది. హీరో హీరోయిన్ల పెళ్లి సందర్భంలో వచ్చే ఈ పాటకు సంగీత దర్శకుడు రామ్ మిరియాల మంచి బాణీలు సమకూర్చారు. ఈ పెళ్లి పాటను మంగ్లీ - సిధ్ శ్రీరామ్ వినసొంపుగా ఆలపించారు. పెళ్లిని అంకెలతో పోల్చూతూ ఆదర్శ వైవాహిక జీవితం గురించి తెలియజేసేలా గీత రచయిత కాసర్ల శ్యామ్ ఈ గీతానికి అద్భుతమైన సాహిత్యం అందించారు.

'కల్యాణం' పాటలో మంగళ స్నానాల దగ్గర నుంచి.. వధువు మెడలో వరుడు తాళి కట్టే వరకు పెళ్లి కార్యక్రమాలు అన్నీ చూపిస్తున్నారు. దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ నీల్ సెబాస్టియన్ అందమైన పెళ్లి మండపం సెట్ వేయగా.. రఘు మాస్టర్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చేశారు. 'కళ్యాణం కమనీయం.. ఈ రెండు మనసులే రమణీయం' అంటూ పెళ్లి తంతును కళ్ళకు కట్టినట్లు చూపించేలా ఉన్న ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. కల్యాణం సాంగ్ 'పుష్పక విమానం' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అర్థం అవుతోంది.

'పుష్పక విమానం' చిత్రానికి హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో శాన్వి మేఘన - సునీల్ - నరేష్ - హర్షవర్థన్ - అజయ్ - సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ రావు దేవరకొండ - విజయ్ మట్టపల్లి - ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.