Begin typing your search above and press return to search.

నందమూరి వారసుడు సక్సెస్ ట్రాక్ ఎక్కేనా...?

By:  Tupaki Desk   |   5 July 2020 5:30 AM GMT
నందమూరి వారసుడు సక్సెస్ ట్రాక్ ఎక్కేనా...?
X
నందమూరి తారకరామారావు మనవడిగా 'బాలగోపాలుడు' సినిమాతో బాలనటుడిగా పరిచయమయ్యాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత నందమూరి నటవారసత్వం ముందుకు తీసుకుకెళ్లడానికి 'తొలి చూపులోనే' అనే సినిమాతో హీరోగా మారాడు.వెంటనే 'అభిమన్యుడు' అనే సినిమాతో పలకరించాడు. అయితే ఈ రెండు సినిమాలు కళ్యాణ్ రామ్ కి విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి 'అతనొక్కడే' అనే సూపర్ హిట్ అందుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ ని హీరోగా నిలబెట్టిందని చెప్పవచ్చు. అయితే నందమూరి వారసుడు హిట్ ట్రాక్ ఎక్కాడు అనుకునే లోపే అర డజనుకు పైగా ప్లాపులు వచ్చి పడ్డాయి.

'అసాద్యుడు' 'విజయదశమి' 'సీతా కళ్యాణం' 'హరే రామ్' 'జయీభవ' 'కళ్యాణ్ రామ్ కత్తి' సినిమాలు నిరాశకు గురి చేసాయి. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రయోగాత్మకంగా 3D యాక్షన్ మూవీగా 'ఓం' సినిమాను నిర్మించాడు. ఈ సినిమా కోసం ఏకంగా గుండుతో కనిపించాడినికి కూడా వెనకాడలేదు కళ్యాణ్ రామ్. ఐనా సరే పరాజయమే పలకరించింది. దీంతో రెండేళ్ల గ్యాప్ తీసుకుని 'పటాస్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకులను పలకరించాడు కళ్యాణ్ రామ్. 2015లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఒక పక్క స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తూనే బయట హీరోలతో కూడా సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలో తమ సంస్థని వెలుగులోకి తీసుకొచ్చిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా 'కిక్ - 2' సినిమాను నిర్మించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత తమ్ముడు ఎన్టీఆర్‌ తో బాబీ డైరెక్షన్‌ లో 'జై లవకుశ' సినిమాని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయిన కళ్యాణ్ రామ్ హీరోగా 'పటాస్' తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాడని చెప్పవచ్చు. 'షేర్' 'ఎమ్మెల్యే' 'ఇజం' 'నా నువ్వే' లాంటి సినిమాలలో నటించినా అవి పెద్దగా తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక గతేడాది తాత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ లో బాబాయి బాలకృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

'ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాల్లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించారు. అయితే ఈ రెండు సినిమా బాక్సాఫీస్ దగ్గర చేదు ఫలితాన్ని అందుకున్నా నటుడిగా కళ్యాణ్ రామ్‌ కు తీపి జ్ఞాపకాన్నే మిగిల్చింది. ఈ సినిమా తర్వాత '118' అంటూ థ్రిల్లర్ మూవీతో హిట్ కోసం ట్రై చేశారు. కాకపోతే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో 'ఎంత మంచివాడవురా' అంటూ సంక్రాంతి బరిలో నిలిచాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయిందని కూడా చాలా మందికి తెలియలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాని హాసిని అండ్ హారిక ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నిర్మించనున్నారు కళ్యాణ్ రామ్.

అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ మళ్ళీ హీరోగా కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో 'డిస్కోరాజా'తో డిజాస్ట‌ర్ ని మూటగట్టుకున్న డైరెక్ట‌ర్ వి.ఐ. ఆనంద్ తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇది కాకుండా తన సొంత బ్యానర్ లో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా నందమూరి నట వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టినా వివాదాలకు రాజకీయాలకు దూరంగా తన పనేంటో తాను చేసుకుంటూ పోతున్నాడు కళ్యాణ్ రామ్. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కళ్యాణ్ రామ్‌.. భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ 'తుపాకీ డాట్ కామ్' ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.