టీజర్: క్రూరమైన బార్బేరియన్ కింగ్ 'బింబిసార'గా కళ్యాణ్ రామ్..!

Mon Nov 29 2021 10:52:00 GMT+0530 (IST)

Kalyan Ram Bimbisara Teaser Out Now

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ మూవీ ''బింబిసార''. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ఉపశీర్షిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ - ఫస్ట్ లుక్ గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.''ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గాన్ని చూసి తల వంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ ఓ రాజ్యం మీసం మెలేసింది.. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బింబిసారుడి ఏకచక్రాధిపత్యం'' అనే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఏకచక్రాధిపత్యం కొనసాగిస్తున్న క్రూరమైన శక్తిమంతమైన బార్బేరియన్ కింగ్ బింబిసారగా కళ్యాణ్ రామ్ ను ఈ టీజర్ ప్రెజెంట్ చేస్తోంది. అదే సమయంలో ఆధునిక యుగంలో మరో పవర్ ఫుల్ పాత్రలోను కనిపిస్తున్నాడు. మరి వీరిద్దరి మధ్య ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే 'బింబిసార' సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

‘బింబిసార’ టీజర్ లోని విజువల్స్ - యాక్షన్ సీన్స్ మరియు ఎలివేషన్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. భారీ సెట్లు - అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న సినిమా అని అర్థం అవుతోంది. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్స్ నిర్వహిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ వర్క్ గా పని చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా 'బింబిసార' నిలవనుంది. ఇందులో కేథరీన్ ట్రెసా - సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.