Begin typing your search above and press return to search.

కాజల్ రిలీజ్ చేసిన 'లవ్ మౌళి' హీరోయిన్ రివీల్ టీజర్..!

By:  Tupaki Desk   |   12 Feb 2022 12:44 PM GMT
కాజల్ రిలీజ్ చేసిన లవ్ మౌళి హీరోయిన్ రివీల్ టీజర్..!
X
హీరోగానే కాకుండా విల‌న్‌ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ గా హోస్ట్‌ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ నవదీప్. ప్రస్తుతం వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటుతున్న నవదీప్.. చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన సినిమా ''లవ్ మౌళి''. ఇటీవల నవదీప్ పుట్టినరోజు సందర్భంగా రానా దగ్గుబాటి రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

నవదీప్ 2.0 ని పరిచయం చేస్తున్నామంటూ వదిలిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. సరికొత్త గెటప్ లో ఇంతకుముందు ఎన్నడూ కనిపించని అవతార్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో ఇప్పుడు హీరోయిన్ లుక్ ని రివీల్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఇందులో భాగంగా నవదీప్ తో గతంలో అనేక చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్ దీనికి సంబంధించిన స్నీకే పీక్ ని రిలీజ్ చేసింది.

''నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలుసు.. చందమామ లాంటి మొహం.. నేరేడు పళ్ళు లాంటి కళ్ళు.. అందమైన ముక్కు.. ఎర్రటి పెదాలు.. పసిపాప లాంటి నవ్వు.. గులాబీ పూలు గుత్తగా పోసినట్లు ఉండే శరీరం.. వీటికంటే ముఖ్యంగా నా ఆలోచనలు నా మనసు అర్థం చేసుకునే అమ్మాయి.. చిత్ర.'' అంటూ నవదీప్ వాయిస్ ఓవర్ తో హీరోయిన్ బ్యాక్ సైడ్ లుక్ ని ఈ వీడియోలో చూడొచ్చు.

వాలెంటైన్స్ డే స్పెషల్ గా 'లవ్ ఆఫ్ మౌళి' ని రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందులో నవదీప్ సరసన పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అవనీంద్ర దర్శకత్వంలో 'లవ్ మౌళి' సినిమా తెరకెక్కుతోంది. సినిమాకి ఎడిటింగ్ కూడా ఆయనే చేస్తున్నారు. నైరా క్రియేషన్స్ బ్యానర్‌ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.