చందమామ అథ్లెటిక్ ఫీట్

Mon Jan 21 2019 09:49:31 GMT+0530 (IST)

చందమామ కాజల్ అందచందాలు ప్రతిభ గురించే కాదు.. తన అందమైన మనసు గురించి.. సామాజిక సేవల గురించి అభిమానులకు ఎంతో కొంత తెలుసు. అనాధ పిల్లలు - పేద ఆడపిల్లల చదువుల కోసం కాజల్ ఎంతో సాయం చేస్తుంటుంది. అందుకోసం ఎన్జీవోలతో కలిసి పని చేస్తోంది. గత కొంతకాలంగా గిరిజన విద్యార్థుల కోసం తనవంతుగా సాయం అందిస్తోంది. తాను అందుకునే పారితోషికాల నుంచి కొంత మొత్తాన్ని ఇలాంటి వెనకబడిన వర్గాల బాగు కోసం కేటాయిస్తోంది. అవసరం మేర నిధి సేకరణ కార్యక్రమాల్ని చేపడుతోంది.అప్పుడప్పుడు `మారథాన్ రన్` అంటూ కాజల్ ఎన్జీవోల సేవలో ఎంతో చెమటోడుస్తోంది. టిఎంఎం(టాటా)- 2019 మారథాన్ పేరుతో నిన్నటిరోజున ముంబైలో జరిగిన రన్ లో ఏకంగా 70 నిమిషాల పాటు.. 10 కి.మీటర్లు పరుగు పెట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా సామాజిక మాధ్యమాల్లో తెలిపింది. తాను అందుకున్న మారథాన్ పథకాన్ని ముద్దాడుతూ ఉన్న ఓ ఫోటోని కాజల్ అభిమానుల కోసం షేర్ చేసింది. ``పోయినేడాది పావు వంతు ట్రైనింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఇకపై చేపట్టాల్సిన గోల్స్ పైన దృష్టిపెట్టాలి. ఫిట్ నెస్.. మంచి పనులు.. వగైరా 2019 లో చాలానే చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది 21 కిలోమీటర్లు పరుగుపెట్టాలన్నది నా ధ్యేయం. ఇదంతా ఎందుకంటే.. థింక్ పీస్ ఆర్గ నైజేషన్ కోసమే. మనందరిలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్న సంస్థ ఇది`` అని తెలిపింది.

ఏపీలోని అరకు వ్యాలీలో గిరిజన బాలల సంక్షేమం కోసం కాజల్ ఎంతో కృషి చేస్తోంది. అక్కడ ఓ విద్యాలయాన్ని నిర్మించి అందులో పిల్లలకు చదువులు నేర్పిస్తోంది. అందుకోసం నిధిని సేకరిస్తోంది. ఇక గిరిజన విద్యార్థుల్లో మెరికల్ని సాన పట్టేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. ఒలింపిక్స్ కి వెళ్లేంత సమర్థత ఈ పిల్లలకు ఉంది. వారి జీవితాల్ని మారుద్దాం.. అంటూ కాజల్ ఎంతో పట్టుదలగా ప్రయత్నిస్తోంది. సామాజిక సేవలో మచ్చలేని చందమామ అని ఈ బ్యూటీని పొగిడేయాల్సిందే. ఇక కెరీర్ పరంగా పరిశీలిస్తే కాజల్ నటించిన `ప్యారిస్ ప్యారిస్` రిలీజ్ కి రెడీ అవుతోంది. మొన్ననే ప్రతిష్ఠాత్మక `భారతీయుడు 2` చిత్రం ప్రారంభమైంది. పలు క్రేజీ ప్రాజెక్టులకు ఈ అమ్మడు కమిట్ కానుందని తెలుస్తోంది.