Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పై కైకాల ప్ర‌శంస‌లు

By:  Tupaki Desk   |   20 Jan 2022 5:34 AM GMT
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పై కైకాల ప్ర‌శంస‌లు
X
ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌మ్మోహ‌న్‌రెడ్డిపై సినీ ద‌గ్గ‌జం, సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో అనారోగ్యం కార‌ణంగా అపోలో హాస్పిట‌ల్ లో చేరిన సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డింది. ఆయ‌న పూర్తిగా కోలుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రికి ఆయ‌న ఓ లేఖ రాయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న ఆరోగ్య స‌మ‌యంలో కుటుంబానికి అండ‌గా నిలిచిన అంద‌రికి ఆయన కృతజ్ఞ‌త‌లు తెలిపారు.

తాను ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో త‌న‌కు అందించిన అమూల్య‌మైన స‌హాయానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని ఏపీ సీఎంకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. క్ష‌ణం తీరిక లేకుండా బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికి వ్య‌క్తిగ‌తంగా కాల్ చేసి ప్ర‌భుత్వం నుంచి ఏదైనా స‌హాయం అందిస్తామ‌ని హామీ ఇవ్వ‌డం ద్వారా మీరు చూపిన శ్ర‌ద్ధ ప‌ట్ల నేను చాలా సంతోషిస్తున్నాన‌ని తెలిపారు. మీరు హామీ ఇచ్చినట్టే మీ ఉన్న‌తాధికారులు వ్య‌క్తిగ‌తంగా హాజ‌ర‌య్యార‌ని, వైద్య ఖ‌ర్చులు భ‌రించ‌డంతో స‌హా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించార‌ని పేర్కొన్నారు.

ఈ క‌ష్ట స‌మ‌యాల్లో మీ స‌హాయం నాకు, నా కుటుంబానికి అద్భుత‌మైన శ‌క్తిని ఇచ్చింద‌ని ఆయ‌న అన్నారు. మీరు చూపిన ఈ శ్ర‌ద్ధ మీకు క‌ళాకారుల ప‌ట్ల, మ‌రియు వారి శ్రేయ‌స్సు ప‌ట్ల ఉన్న గౌర‌వాన్ని మ‌రోసారి రుజువు చేసింద‌న్నారు. ప్ర‌జ‌ల ప‌ట్ల మీరున్న శ్ర‌ద్ధ రాష్ట్రం మంచి చేతుల్లోనే వుందనే భ‌రోసా ఇచ్చింద‌ని కైకాల స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. అనారోగ్యం పాలైన‌ప్ప‌టి నుంచి అండ‌గా ఉన్నందుకు నేను మరోసారి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌న్నారు.

ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ కు నూత‌న సంవ‌త్స‌ర‌, సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. తాను సంత‌కం చేయ‌లేక‌పోవ‌డంతో త‌న కుమారుడి కొడుకు ఈ కృతజ్ఞ‌తా లేఖ పై సంత‌కం చేశార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అంతే కాకుండా త‌నకు బాగోలేన‌ప్పుడు త‌న కుటుంబానికి అండ‌గా నిలిచిని ప్ర‌తీ ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. అలాగే అభిమానుల ప్రార్థ‌న‌లే త‌న‌ని మ‌ళ్లీ మామూలు మ‌నిషిని చేశాయ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌.