Begin typing your search above and press return to search.

'మక్కల్ సెల్వన్' క్రేజ్ ని వాడుకుంటున్న ప్రొడ్యూసర్స్...?

By:  Tupaki Desk   |   27 May 2020 2:30 PM GMT
మక్కల్ సెల్వన్ క్రేజ్ ని వాడుకుంటున్న ప్రొడ్యూసర్స్...?
X
తమిళ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు. అంతేకాకుండా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. 'పిజ్జా' 'కాలా' వంటి డబ్బింగ్ సినిమాలతో కూడా ఇక్కడి వారిని అలరించాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు క్రేజీ యాక్టర్ గా నిర్మాతల హీరోగా మారిపోయాడు. తన విలక్షమైన నటనతో అందర్నీ మెప్పిస్తూ 'మక్కల్ సెల్వన్' అనిపించుకుంటూ వస్తున్నాడు. సుకుమార్ - బన్నీ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప' సినిమాలో కూడా విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ ఇంతకముందు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నాడని న్యూస్ వచ్చింది. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి తమిళంతో పాటు తెలుగు హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలో విజయ్ సేతుపతి ప్రస్తుతం 'కా.పే.రణసింగమ్‌' అనే తమిళ సినిమాలో నటించాడు. వీరుమాండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని కోటపాడి రాజేష్ నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కోడలు.. జీవీ ప్రకాష్ సిస్టర్ అయినటువంటి జీవీ భవానీ సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇటీవల విడుదలైన 'కా.పే.రణసింగమ్‌' ఆఫీసియల్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రజా సమస్యలపై పోరాడే యువకుడు ఎదుర్కున్న సమస్యలు.. భర్త కోసం భార్య చేసే పోరాటం ఇతి వృత్తంలో 'కా.పే.రణసింగమ్‌' సినిమా ఉండబోతోందని సమాచారం. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందట. ఐశ్వర్యా రాజేష్ జీవీ భవానీ లు పాత్రలు ముఖ్య భూమికను పోషిస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఈ విషయం నిజమే అనే అనుమానం రాకమానదు. అయితే ఈ చిత్ర యూనిట్ మాత్రం విజయ్ సేతుపతి పేరు చెప్పుకొని సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాయట. ఈ సినిమాలో విజయ్ కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ప్రచార చిత్రాలలో 'మక్కల్ సెల్వన్' పేరు వాడుకొని క్రేజ్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నారట.

ఇలా విజయ్ సేతుపతి క్రేజ్ యూస్ చేసుకుని మార్కెట్ చేసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సినిమాల్లో ఆయన రోల్ చాలా చిన్నదైనప్పటికీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి అతని పేరు మీదుగానే ప్రమోట్ చేసుకున్నారు. 'కా.పే.రణసింగమ్‌' టీమ్ కూడా అదే ప్లాన్ లో ఉన్నారట. ఈ న్యూస్ తెలిసిన విజయ్ సేతుపతి ఫ్యాన్స్ మరియు కోలీవుడ్ వర్గాల వారు ఓపెన్ గానే ఈ విషయంపై కామెంట్ చేస్తున్నారట. ఏదేమైనా విజయ్ సేతుపతి క్రేజ్ చిన్న సినిమాల మార్కెట్ కి వరంగా మారుతోందని చెప్పవచ్చు. కాగా విజయ్ సేతుపతి ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ తో కలిసి 'మాస్టర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.