KGF: చాప్టర్ 2 .. భూమ్మీద అత్యంత క్రూరుడు అధీరా!

Thu Jul 29 2021 14:41:43 GMT+0530 (IST)

KGF Chapter 2  Adhira like Bhishma in Puranas

ఎవరాయన..? పురాణాల్లో కవచధారియైన భీష్ముడిలా.. హాలీవుడ్ హిస్టారికల్ సినిమాల్లో విలన్ లాగా క్రూరంగా ఉన్నాడు? ఏమో.. మాకు తెలీదు అనడానికి లేదు.. ఆయన అధీరా! కేజీఎఫ్ - చాప్టర్ 2లో విలన్. ది గ్రేట్ ఖల్ నాయక్ సంజయ్ దత్ రూపం మొత్తాన్ని మార్చేశారు ప్రశాంత్ నీల్. ఆయనను అరివీర భయంకరుడిగా ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రాకతోనే అర్థమైంది. ఇప్పుడు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ తో అన్ని అనుమానాలు పటాపంచలు అయ్యాయి. అధీరా క్రూరత్వాన్ని ఇక తెరపై చూడాల్సిందే అన్నంత కసిని రగిలించాడు.అధీరాను మాన్ స్టర్ లా ఆవిష్కరిస్తున్నారని తాజా పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఇక ఈ పోస్టర్ ని చూడగానే పురాణాల్లో భీష్ముడు కాస్త అటూ ఇటూగా ఇలాగే కవచం ధరించి కనిపించేవాడని.. లేదూ `వార్ ఆఫ్ ది యారోస్` చిత్రంలో విలన్ ఇలానే కనిపించాడని సినీప్రేమికులు విశ్లేషిస్తున్నారు. వార్ ఆఫ్ ది యారోస్ కథ కూడా ఆసక్తికరం. బాణాన్ని సూటిగా శత్రువు కంటికి గురి పెట్టే నిపుణులైన వారితో తలపడే ఓ గొప్ప ఆర్చర్ గా ఈ చిత్రంలో హీరో కనిపిస్తాడు. ఇక విలన్ల గుంపులో క్రూరమైన విలన్లు కవచాలు ధరించి భీకరంగా కనిపిస్తారు. అడవిలో ఆర్చరీ పోరాటం అద్భుతంగా రక్తి కట్టిస్తుంది. మొత్తానికి అధీరా లుక్ చాలా విషయాల్ని గుర్తు చేస్తోంది.

నేడు సూపర్ స్టార్ సంజయ్ దత్ పుట్టినరోజు ప్రత్యేక వేడుకలకు కేజీఎఫ్-2 టీమ్ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అభిమానులు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు. దత్ ఆరాధకులందరికీ ఆశ్చర్యం కలిగించే ట్రీట్ ఈ లుక్. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా కేజీఎఫ్ 2 రికార్డులకెక్కింది. ఇక డార్క్ షేడ్ లో పోస్టర్ ని ఎలివేట్ చేసిన తీరు... ఇందులో యాక్షన్ డ్రామా ఏ రేంజులో ఉంటుందో ఆవిష్కరిస్తోంది. అధీరా చేతిలో ఆయుధం చూస్తేనే గుండెల్లో దడ పుట్టాల్సిందే. దత్ కొత్త రూపానికి అన్ని వైపుల నుండి గొప్ప స్పందన వస్తోంది. అభిమానులు వారి ఉత్సాహాన్ని సోషల్ మీడియాల ద్వారా పంచుకుంటున్నారు.

హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన `కేజీఎఫ్: చాప్టర్ 2` బహుభాషల్లో అత్యంత భారీగా రిలీజ్ కానుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రవీనా టాండన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. కోలార్ బంగారు గనుల మాఫియా కథాంశంతో ఈ చిత్రాన్ని మొదటి భాగాన్ని మించిన యాక్షన్ తో తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. ఆ తర్వాత అంచనాలు స్కైని తాకాయి. ఇప్పుడు అందుకు ఏమాత్రం తగ్గలేదని ఈ పోస్టర్లు చెబుతున్నాయి. మోస్ట్ అవైటెడ్ 2021 మూవీ కోసం అభిమానులంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రిలీజ్ తేదీ ప్రకటిస్తారనే వేచి చూస్తున్నారు.

21కోట్ల మంది టీజర్ వీక్షణ

ఇంతకుముందు కెజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ రిలీజై సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. టీజర్ ఆద్యంతం యష్ ఎంతో స్టైలిష్ గా రఫ్ గా కనిపించాడు. అతడి ఎలివేషన్ షాట్స్ హైలైట్ గా నిలిచాయి. జూలై 16 నాటికి టీజర్ యూట్యూబ్ లో 200 మిలియన్ల (20కోట్లు) వీక్షణలను సాధించింది. కెజిఎఫ్ చాప్టర్ 2 జూలై 16 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కరోనావైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి- ప్రకాష్ రాజ్- మాళవికా అవినాష్- అచ్యుత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇది 2018 లో విడుదలైన కెజిఎఫ్ కి సీక్వెల్.