'రాధే శ్యామ్' కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్...!

Tue Oct 20 2020 18:00:21 GMT+0530 (IST)

Tamil music director for 'Radhe Shyam' ...!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రాధే శ్యామ్''. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్ - ప్రశీద నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ లవ్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులను వెల్లడించిన చిత్ర యూనిట్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచింది. తాజాగా తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ 'రాధేశ్యామ్' చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న 'బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్' పేరుతో మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.కాగా జస్టిన్ ప్రభాకరన్ తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు పాటలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే 'రాధే శ్యామ్' టీమ్ ప్రభాకరన్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ తొలిసారి ఓ పాన్ ఇండియా మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ - కునాల్ రాయ్ కపూర్ - సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - శాషా ఛత్రి - ప్రియదర్శి - రిద్దికుమార్ - సత్యాన్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే ఇటలీలో తిరిగి ప్రారంభమైంది. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న 'రాధే శ్యామ్'ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.