మహారాజా షూటింగ్ ప్రారంభం.. స్టార్ హీరో తనయుడు సన్నద్ధం!

Thu Jun 10 2021 05:00:01 GMT+0530 (IST)

Junaid resumes shooting for his debut film

సినీ ఇండస్ట్రీలో వారసులు హీరోలుగా రావడం అనేది చూస్తూనే ఉన్నాం. కొడుకులు హీరోలు అవుతుంటే కూతుళ్లు హీరోయిన్స్ అవుతున్నారు. ఇదంతా ఎప్పటినుండో జరుగుతూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వారసత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ యాక్టర్స్ అందరూ తమ తమ పిల్లలను ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఎంట్రీ జరగబోతుంది. 'మహారాజా' అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టబోతున్నాడు జునైద్.లాక్ డౌన్ అనంతరం ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగులకు సాయంత్రం 8గంటల వరకు అనుమతి ఇవ్వడంతో మేకర్స్ అందరూ షూటింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ముంబైలో జునైద్ ఖాన్ తన మూవీ షూటింగ్ కిక్-స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. జునైద్ గత కొన్ని నెలలుగా తన లుక్స్ మరియు క్యారెక్టర్ పై పనిచేస్తున్నాడు. దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా - అతని ప్రొడక్షన్ బృందం కొన్ని నెలలుగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఈ సినిమాకోసం ముంబైలోని విజయ్ నగర్ ప్రాంతంలో భారీ సెట్ నిర్మించబడింది. పీరియడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో జునైద్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు.

అయితే ఈ మహారాజా సినిమా 1862లో జరిగిన ఓ మహారాజ్ పరువు కేసు ఆధారంగా రూపొందించనున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో మత నాయకుడు జదునాథ్జీ బ్రిజ్రాతంజీ మహారాజ్ కు తన శిష్యులకు సంబంధించిన సబ్జెక్టు ఆధారంగా ఈ సినిమా నడుస్తుందట. మతాధిపతి తన మహిళా భక్తులతో లైంగిక సంబంధాలను బహిర్గతం చేసిన వార్తాపత్రికపై కేసు నమోదు చేస్తాడు. ఈ చిత్రంలో జర్నలిస్ట్ కర్సాండస్ ముల్జీ పాత్రలో జునైద్ ఖాన్ నటించనున్నాడు. మహారాజా జర్నలిస్ట్ కర్సాండస్ ముల్జీని కోర్టుకు ఎలా తీసుకెళ్లారో చూపనున్నారట. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో జునైద్ తో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే షార్వారి వాగ్ జైదీప్ అహ్లవత్ ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు.