Begin typing your search above and press return to search.

టికెట్ ధరల పెంపు పై జీవిత రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   19 May 2022 2:30 AM GMT
టికెట్ ధరల పెంపు పై జీవిత రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు..!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య సినిమా టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వాలు జీవోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పెద్ద హీరోల చిత్రాలను ప్రత్యేకంగా పరిగణిస్తూ.. మేకర్స్ రిక్వెస్ట్ ని బట్టి అదనంగా రేట్లు పెంచుకోడానికి అనుమతిస్తున్నాయి.

ఇటీవల కాలంలో 'RRR' - 'కేజీఎఫ్ 2' - 'బీస్ట్' - 'ఆచార్య' - 'సర్కారు వారి పాట' సినిమాలను అధిక టికెట్ రేట్లతో రిలీజ్ చేశారు. ఇది భారీ చిత్రాలకు ఓపెనింగ్స్ రావడానికి ఎంతగా ప్లస్ అవుతుందో.. అదే స్థాయిలో మైనస్ గా కూడా మారుతోందని తెలుస్తోంది.

ఎందుకంటే అధిక టికెట్ ధరల కారణంగా సామాన్య ప్రజలు థియేటర్లకు రావడం లేదు. అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటూ పోవడంపై సాధారణ ప్రేక్షకులు పెదవి విరిచినట్టు కనిపిస్తోంది. అభిమానులు సైతం రిపీట్ షోలు వేయడానికి వెనకడుగు వేస్తున్నారు.

మొత్తం మీద టికెట్ రేట్ల వల్లే ఇప్పుడు థియేటర్లు ఖాళీగా ఉంటున్నానేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరల వ్యవహారం పై తాజాగా దర్శక నిర్మాత జీవిత రాజశేఖర్ స్పందించింది. రేట్స్ పెంచడం అనేది పెద్ద సినిమాలకు తప్పదని అభిప్రాయ పడింది.

''టికెట్స్ ధరలు భారీగా పెరగడం వలన థియేటర్లకు జనాలు రావడం లేదని విన్నాను. రేట్స్ పెంచడం అనేది పెద్ద సినిమాలకు తప్పదు. మా 'శేఖర్' సినిమాకు రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం చెప్పిన ధరలకే అమ్ముతున్నాం. మీకు అందుబాటులోనే టికెట్ రేట్లు ఉంటాయి. మే 20న సినిమాను తప్పకుండా చూడండి'' అని జీవిత చెప్పుకొచ్చారు.

సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''శేఖర్''. ఇందులో వీరి కూతురు శివాని కీలకపాత్రలో నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవితా రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"నన్ను అందరూ ఐరన్ లేడీ అంటున్నారు. జీవితంలో ఎన్నో విషయాల్లో పోరాడుతూ వచ్చాను. ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఎవరినీ మోసం చేయలేదు.. వీలైతే సాయం చేశాను. నాకు కూడా చాలా మంది సాయం చేశారు. అందుకే ఈ రోజు ఇంత మంది వచ్చారు. ఇదేమీ మామూలు ప్రపంచం (సినిమా) కాదు. ఒకరొకరు సాయం చేసుకుంటూ ఇలానే ఉంటే బాగుంటుంది'' అని జీవిత అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ ''ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్క మంచి మనసుకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఇలాంటి మంచి మాటలే ఇప్పుడు అవసరం. కరోనా తరువాత థియేటర్‌లకు జనాలు రావడం లేదని అందరూ అంటున్నారు. సినిమా తీయడం కంటే విడుదల చేయడం ఇప్పుడు కష్టంగా మారింది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. తప్పకుండా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను'' అని చెప్పుకొచ్చారు.